Road Accident: భర్త కోసం ఎదురు చూస్తూ అనంతలోకానికి, రోడ్డుపక్కన ఉన్న తల్లీబిడ్డలపై దూసుకెళ్లిన లారీ
Road Accident: భర్త కోసం ఎదురుచూస్తూ రోడ్డు పక్కనే కూర్చోన్న భార్య, బిడ్డపై మృత్యువు ఆవహించింది. తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, బిడ్డపై లారీ దూసుకెళ్లడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు.
Road Accident: భర్త కోసం ఎదురుచూస్తూ రోడ్డు పక్కనే కూర్చోన్న భార్య, బిడ్డపై మృత్యువు ఆవహించింది. తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, బిడ్డపై లారీ దూసుకెళ్లడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. కుమారుడికి, అమ్మమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషాద ఘటనతో కుటుంబం కన్నీరు మున్నీరు అయింది.
ఈ ఘటన ఆదివారం తిరుపతి జిల్లా ఏర్పేడు-వెంకటగిరి రహదారిపై అముడూరు వద్ద చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి మండలంలోని రామానుజపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన బాపన శారద (22), శివ దంపతులు. వీరికి కుమారుడు గురుకార్తీక్ (4), కుమార్తె గురువైష్ణవి (2)లు ఉన్నారు. పిల్లలతో కలిసి తొట్టంబేడు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన తల్లి విజయమ్మ ఇంటికి శారద శనివారం వెళ్లింది.
ఆదివారం రాత్రి అక్కడ నుంచి తల్లి విజయమ్మతో పాటు తన ఇద్దరి పిల్లలను తీసుకుని బస్సులో శ్రీకాలహస్తి మండలంలోని రామానుజపల్లి క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. తాము వస్తున్న విషయాన్ని భర్త శివకు ఫోన్ చేసి చెప్పి, బైక్ తీసుకుని రమ్మని శారద చెప్పింది. భర్త వచ్చే వరకు అక్కడ బస్సు దిగి రోడ్డు పక్కన చెట్టువద్ద ఉన్న బండపై తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి కూర్చొని ఉంది.
విజయవాడ నుంచి చెన్నైకి వెళుతున్న టర్బోలారీ అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. దీంతో శారద, బిడ్డ గురు వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందారు. విజయమ్మ, గురుకార్తీక్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమీపంలోని టోల్‌ప్లాజా సిబ్బంది వచ్చి జాకీలతో లారీ టైర్లను పైకి లేపి శారదను బయటకు తీశారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వారిని శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ మరణించడంతో సంఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ…
అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో కడప-చెన్నై జాతీయ రహదారిలోని ఆల్విన్ ఫ్యాక్టరీ సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఆదివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మద్యంమత్తులో ఉన్న లారీ డ్రైవర్ బస్సును ఢీకొట్టాడు.
తిరుపతి నుంచి జమ్మలమడుగు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కడప నుంచి చెన్నై వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ తారకరాముడు (40) మృతి చెందాడు. లారీ డ్రైవర్ మల్లెల ధనుంజయ లారీలోనే ఇరుక్కుపోయారు. అలాగే బస్సు డ్రైవర్ రాజు బస్సులోనే ఇరుక్కుపోయారు.
ఈ రోడ్డు ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సు, లారీల్లో ఇరుక్కుపోయిన వారిని జేసీబీల సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను వైద్యం కోసం కడప రిమ్స్‌కు, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)