Balakrishna Telugu Titans: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఇంట్లో తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు సందడి చేశారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 కు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఫూణే, నోయిడా, ముంబై, జైపూర్, పాట్నాతో పాటు మరికొన్ని నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
హైదరాబాద్ మ్యాచ్‌లు జనవరి 19 నుంచి మొదలుకానున్నాయి . గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం జరుగున్న మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల ముందుగానే తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు హైదరాబాద్ వచ్చారు.
బుధవారం తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. ఆయన్ని కలిశారు. తెలుగు టైటాన్స్ జెర్సీని బాలకృష్ణకు అందజేశారు. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్, కోచ్ శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర ఆటగాళ్లు బాలకృష్ణను కలిసిన వారిలో ఉన్నారు. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లతో కలిసి బాలకృష్ణ తొడకొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాలకృష్ణతో పవన్ షెరావత్ కలిసి దిగిన ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గచ్చిబౌలిలో శుక్రవారం జరుగనున్న తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మ్యాచ్‌కు బాలకృష్ణను తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో జరుగనున్న తొలి మ్యాచ్‌కు బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నారు. పీకేఎల్ సీజన్ 10కు స్టార్ స్పోర్ట్స్ తరఫున బ్రాండ్ అంబాసిడర్‌గా బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు.
పీకేఎల్ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఆటతీరు బాగుందని, అదే జోరును హైదరాబాద్ జరిగే మ్యాచ్‌లలో కొనసాగించాలని బాలకృష్ణ అన్నాడు. హైదరాబాద్ టీమ్‌కు అభిమానులు మద్దుతుగా నిలవాలని పిలుపిచ్చారు. సొంత మైదానంలో ఆడేందుకు తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ అన్నాడు. అభిమానుల మద్దతు, ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిస్తుందని, గెలుపే లక్ష్యంగా హైదరాబాద్ మ్యాచ్‌లను ఆడనున్నామని తెలిపాడు.
పీకేల్ సీజన్ 10లో పేలవమైన ఆటతీరుతో తెలుగు టైటాన్స్ అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ కేవలం ఒకే ఒక విజయం సాధించింది. 10 పాయింట్స్‌తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. పదమూడు మ్యాచుల్లో 9 విజయాలతో జైపూర్ పింక్ పాంథర్స్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా...పుణేరి ఫల్లాన్ సెకండ్, దబాంగ్ ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి. డిసెంబర్ 2న పీకేఎల్ సీజన్ 10 మొదలైంది. ఫిబ్రవరి 21 వరకు లీగ్ మ్యాచులు జరుగనున్నాయి. మొత్తం 12 సిటీలలో ఈ మ్యాచ్‌లను నిర్వహించబోతున్నారు.