AP wine Shops Bandh: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీ నుంచి వైన్ షాపులు బంద్.. కారణం ఇదే..
31 August 2024, 12:40 IST
- AP wine Shops Bandh: మందుబాబులకు ఇది చేదు వార్త. అవును.. ఏపీలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ చేయాలని.. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిర్ణయించారు. దీంతో అన్ని వైన్ షాపులు బంద్ కానున్నాయి.
ఏపీలో వైన్ షాపులు బంద్
ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. వారంతా ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. కానీ.. ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వం వీరి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అందుకే మూసేస్తున్నాం..
గత ప్రభుత్వ హయాంలో తమను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే.. 15 వేల మంది కాంట్రాక్ట్, ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడతారని వాపోతున్నారు. తమ విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్ 7 నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయానికొచ్చారు.
అక్టోబర్ నుంచి కొత్త పాలసీ..
అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతికి పాల్పడిందని.. ఈసారి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా.. కొత్త మద్యం పాలసీలో మార్పులు, చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
మద్యం రేట్లు తగ్గే ఛాన్స్..
మద్యం రేట్లను కూడా భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం నిషేధం పేరుతో.. ధరలను విపరీతంగా పేంచేసి, నకిలీ బ్రాండ్లను దించేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో మద్యం ప్రియుల జేబులు గుల్ల కావడమే కాకుండా.. ఆరోగ్యమూ చెడిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం తక్కువ ధర కేటగిరీలో వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను 80 నుంచి 90 రూపాయలకే విక్రయించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి.