AP Rains: అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దు.. ఏపీ ప్రభుత్వం హెచ్చరిక.. ఆ ప్రాంతాల్లో బడులకు సెలవు
AP Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రజలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు అలెర్ట్ అయ్యింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అవసరం ఉంటే తప్ప ఇల్లు వదిలి బయటకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అందరూ అలెర్ట్‌గా ఉండాలని ఆదేశించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వైపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
నాటు పడవల్లో ప్రయాణం వద్దు..
కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాటు పడవల్లో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద నీటిలో స్నానాలు, ఈతకు, చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
చంద్రబాబు సమీక్ష..
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాలు, పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు తగు సూచనలు చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.
స్కూళ్లకు సెలవు ప్రకటించాలి..
భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి.. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్‌కు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని సూచించారు. ఎడతరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. విజయవాడ మొఘల్రాజపురం సున్నపు బట్టీలు సెంటర్ సమీపంలో ఉన్న మసీదు పక్కన కొండచరియలు జారిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.
మరికొన్ని గంటలు రోడ్లపైకి రావొద్దు..
విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు మరికొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వీవీఐపీలు బయటకు రావొద్దని పోలీసులు కోరారు. జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రొడ్లలోకి వాహనాల మళ్లించారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించ వద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
భారీగా ట్రాఫిక్ జామ్..
విజయవాడలోకి వచ్చే వాహనాలు దారి మల్లించాలని పోలీసులు నిర్ణయించారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. ఎస్కార్ట్ వాహనాలను ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. నిడమానూరు నుంచి టంకసాల వరకు జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగింది.