APSRTC Arunachalam : మూడు జిల్లాల నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు స్పెషల్ సర్వీసులు, ఏపీపీఎస్ఆర్టీసీ ప్యాకేజీలివే
17 July 2024, 16:06 IST
- APSRTC Arunachalam Buses : ఏపీఎస్ఆర్టీసీ అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. పలు జిల్లాల నుంచి ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది.
మూడు జిల్లాల నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు స్పెషల్ సర్వీసులు
APSRTC Arunachalam Buses : అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అరుణాచలం గిరి ప్రదక్షణకు స్పెషల్ సర్వీసును వేసింది. పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై)కి ఏపీఎస్ఆర్టీసీ ఏడు స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది.
ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టి, ప్రయాణికులు, యాత్రికులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై)కి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.
ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్లతో తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై) దర్శన యాత్రకు యాత్రికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. జులై 20న గిరి ప్రదక్షిణ ఉంటుంది. అందువల్ల జులై 19 (శుక్రవారం) పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి బస్సులు రాత్రి ఏడు గంటలకు బయలుదేరుతాయి. శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం (వేలూరు) మీదుగా మరుసటి రోజు శనివారం అరుణాచలం చేరుకుంటాయి. పౌర్ణమి రోజున అరుణాచలంలో గిరి ప్రదక్షిణ జరిగిన తరువాత, అరుణాచలేశ్వరుని దర్శనం ఉంటుంది.
కృష్ణా జిల్లాలోని విజయవాడ, ఆటోనగర్, ఉయ్యూరు, గన్నవరం డిపోల నుంచి బస్సులు రాత్రి 9 గంటలకు బయలుదేరతాయి. శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం (వేలూరు) మీదుగా మరుసటి రోజు శనివారం అరుణాచలం చేరుకుంటాయి. పౌర్ణమి రోజున అరుణాచలంలో గిరి ప్రదక్షిణ జరిగిన తరువాత, అరుణాచలేశ్వరుని దర్శనం ఉంటుంది.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి డిపో నుంచి ఈనెల 20న అరుణాచలానికి బస్సు బయలుదేరుతుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణతో పాటు వేలూరు గోల్డెన్ టెంపుల్, కాణిపాక వరసిద్ధ వినాయకస్వామి దర్శనం ఉంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పౌర్ణమి నాడు జులై 20 (శనివారం)న ఉదయం 5.50 గంటలకు ప్రారంభం అవుతుంది. జూలై 21 (ఆదివారం) న మధ్యాహ్నం 3.47 నిమిషాలకు ముగుస్తుంది. టిక్కెట్టు ధర జిల్లాల నుంచి వెళ్లే సర్వీసులకు వేర్వేరుగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్లే మూడు సర్వీసులకు ఒక టిక్కెట్టు ధర రూ. 2,973గా ఉంది. అలాగే కృష్ణా జిల్లా నుంచి వెళ్లే మూడు సర్వీసులకు ఒక్కొ టిక్కెట్టు ధర రూ. 2,490గా ఉంది.
టిక్కెట్టు కోసం బస్సు డిపోల బుకింగ్ కౌంటర్‌ను సంప్రదించాలి. లేకపోతే ఏపీఎస్ఆర్‌టీసీ అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.apsrtconline.in/oprs-web/guest/home.do?h=1 ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరుతోంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు