APSRTC Arunachalam Buses : కాకినాడ నుంచి అరుణాచ‌లం గిరి ప్రద‌క్షణ‌కు ప్రత్యేక బస్సు, ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ ఇదే-apsrtc running special service bus kakinada to arunachalam giri pradakshina ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Arunachalam Buses : కాకినాడ నుంచి అరుణాచ‌లం గిరి ప్రద‌క్షణ‌కు ప్రత్యేక బస్సు, ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ ఇదే

APSRTC Arunachalam Buses : కాకినాడ నుంచి అరుణాచ‌లం గిరి ప్రద‌క్షణ‌కు ప్రత్యేక బస్సు, ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ ఇదే

HT Telugu Desk HT Telugu
Jul 15, 2024 09:07 PM IST

APSRTC Arunachalam Buses : కాకినాడ నుంచి అరుణాచలానికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సర్వీస్ నడుపుతోంది. ఈ నెల 19న కాకినాడ నుంచి బస్సు బయలుదేరుతుంది. ఈ సర్వీస్ ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.

కాకినాడ నుంచి అరుణాచ‌లం గిరి ప్రద‌క్షణ‌కు ప్రత్యేక బస్సు, ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ
కాకినాడ నుంచి అరుణాచ‌లం గిరి ప్రద‌క్షణ‌కు ప్రత్యేక బస్సు, ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ

APSRTC Arunachalam Buses : అరుణాచ‌లం వెళ్లే భ‌క్తుల‌కు శుభ‌వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అరుణాచ‌లం గిరి ప్రద‌క్షణ‌కు స్పెష‌ల్ స‌ర్వీసును వేసింది. కాకినాడ‌ నుంచి త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై)కి ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జరీ బ‌స్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ స‌ర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది. ఇత‌ర ఆధ్యాత్మిక ప్రాంతాల ప‌ర్యట‌న స‌ర్వీసులానే ఈ బ‌స్సు స‌ర్వీస్‌లు కూడా అరుణాచలం సంద‌ర్శించేందుకు తీసుకెళ్తుంది.

ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్రత్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టి, ప్రయాణికులు, యాత్రికులు అత్యధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై)కి ఈ బస్సు స‌ర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.

ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జరీ బ‌స్సు స‌ర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్లతో కాకినాడ‌ నుంచి త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై) ద‌ర్శన‌ యాత్రకు యాత్రికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. జులై 20న గిరి ప్రదక్షిణ ఉంటుంది. అందువ‌ల్ల జులై 19 (శుక్రవారం) మ‌ధ్యాహ్నం 1 గంట‌కు కాకినాడ‌ బ‌స్ కాంప్లక్స్‌లో బ‌స్ బ‌య‌లుదేరుతుంది. కాణిపాకం, శ్రీ‌పురం ద‌ర్శనం త‌రువాత, మ‌రుస‌టి రోజు శ‌నివారం ఉద‌యం అరుణాచ‌లం చేరుకుంటుంది.

పౌర్ణమి రోజున అరుణాచలంలో గిరి ప్రద‌క్షిణ జ‌రిగిన త‌రువాత‌, అరుణాచ‌లేశ్వరుని ద‌ర్శనం ఉంటుంది. అనంత‌రం పెద్ద కంచి మీదుగా శ్రీ‌కాళ‌స్తి ద‌ర్శనం అయిన త‌రువాత జులై 22న రాత్రి ప‌ది గంట‌ల‌కు కాకినాడ‌కు చేరుకుంటుంది. అరుణాచ‌లంలో గిరి ప్రద‌క్షిణ పౌర్ణమి నాడు జులై 20 (శ‌నివారం)న ఉద‌యం 5.50 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. జులై 21 (ఆదివారం) న మ‌ధ్యాహ్నం 3.47 నిమిషాల‌కు ముగుస్తుంది. టికెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి రూ.3,100గా ఆర్టీసీ నిర్ణయించింది. టిక్కెట్టు కావాల‌నుకునేవారు కాకినాడ బ‌స్సు డిపోను సంప్రదించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకోవ‌డం అవుతుంది. యాత్రికులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని డిపో అసిస్టెంట్ క‌మిష‌నర్ ఎంయూవీ మ‌నోహ‌ర్‌ తెలిపారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం