Arunachalam RTC Buses: అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం ఆర్టీసీ బస్సు సర్వీసులు
Arunachalam RTC Buses: అరుణాచలం గిరి ప్రదక్షణ కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసింది.
Arunachalam RTC Buses: అరుణాచల గిరి ప్రదక్షణ కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఈనెల 22న జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా పుణ్యక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తమిళనాడులోని అరుణాచలానికి నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. భక్తులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు తుని నుంచి బయలుదేరి శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేసుకున్న తరువాత అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్తుంది. గిరి ప్రదక్షిణ అనంతరం కంచి, విజయవాడ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు. 23 ఉదయం తునికి చేరుకుంటారు.
ఈ బస్సులో ప్రయాణం చేసేందుకు ఒక్కొక్కరికి రూ.3,500 టికెట్ చార్జి నిర్ణయించారు. టికెట్ రిజర్వ్ చేసుకునేవారు డిపో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. వివరాలకు 7382913216, 7330651904, 7382913016 ఫోన్ నంబర్లను సంప్రదించాలి.
మచిలీపట్నం నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ స్పెషల్ బస్సు సర్వీస్ బయలుదేరుతుంది. ఈ సర్వీసు మచిలీపట్నం నుంచి రేపల్లె మీదుగా శ్రీకాళహస్తి, కాణిపాకం, అర్ధవీడు, సిరిపురం మీదుగా అరుణాచలం చేరుతుంది. 22వ తేదీ పౌర్ణమి రోజున దైవదర్శనం, అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకుని అనంతరం కంచి, విష్టుకంచి, కామాక్షమ్మ గుడి, బంగారు బల్లి, తిరుత్తణి దర్శించుకుని 24వ తేదీన మచిలీపట్నం చేరుకుంటారు. ఆన్‌లైన్ ద్వారా ఏపీఆర్టీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్టు బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్టు ధర రూ.3,000గా నిర్ణయించారు. మచిలీపట్నం బస్ కాంప్లెక్స్ రిజర్వేషన్ కౌంటర్ సెల్ నంబర్ 8808807789ను సంప్రదించాలి.
పీలేరు నుంచి అరుణాచలానికి ఈనెల 21న ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. ఎక్స్‌ప్రెస్ బస్ సర్వీస్ టిక్కెట్టు ధర రూ.700 కాగా, ఆర్డినరీ బస్ సర్వీస్ టిక్కెట్టు ధర రూ.650 నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్ బస్సు ఈనెల 21న మధ్యాహ్నం 1 గంటలకు పీలేరు నుంచి బయలుదేరుతోంది. ఆర్డినరీ బస్సు తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరుతుంది. అరుణాచలంలో ఆలయ దర్శనం, గిరిప్రదక్షిణ అనంతరం బస్సు తిరిగి పీలేరుకు బయలుదేరుతుంది. వివరాల కోసం కె.వి రమణ 7893152748 నంబర్‌ను సంప్రదించాలి.
రాజంపేట నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఆర్టీస్ అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 21న పౌర్ణమిని పురస్కరించుకుని రాజంపేటనుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్ నడుపుతున్నారు. 21న రాజంపేట బస్సు కాంప్లెక్స్ నుంచి ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరుతుంది. టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
అలాగే సత్తెనపల్లి నుంచి అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది. సత్తెనపల్లి బస్ కాంప్లెక్స్ నుంచి ఈనెల 21 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, 22న అరుణాచలం, గిరి ప్రదక్షిణ, దర్శనం తరువాత అదే రోజు సాయంత్రం కంచి మీదుగా 23న ఉదయం మళ్లీ సత్తెనపల్లికి చేరుకుంటుంది. టిక్కెట్టు ధర రానుపోను రూ.2,000 ఉంటుంది. టిక్కెట్లును ఆన్‌లైన్‌లో ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)