Vizianagaram News : విజయనగరంలో తీవ్రవిషాదం, ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు గల్లంతు
28 May 2024, 21:28 IST
- Vizianagaram News : విజయనగరం జిల్లా తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఈత కొట్టేందుకు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు.
విజయనగరంలో తీవ్రవిషాదం, ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు గల్లంతు
Vizianagaram News : విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ముగ్గురి ప్రాణం తీసింది. విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద వాటర్ ఫాల్స్‌లో ముగ్గురు బాలురు గల్లంతైయ్యారు. వారి కోసం ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారిని వెతికే పనిలో పడ్డాయి. గల్లంతైన బాలురి కోసం విజయనగరం పట్టణం కంటోన్మెంట్ కు చెందిన వారని తెలుస్తోంది. మొత్తం ఆరుగురు యువకులు ఈత కొట్టడానికి మంగళవారం ఉదయం 7:20 గంటలకు గోస్తనీ నది చెక్ డ్యామ్ కు వెళ్లారు. అందులోకి ఆరుగురు దిగారు. ఈత కొడుతున్న సమయంలో మొదట ఒకరు ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో, అతడిని రక్షించేందుకు మరొకరు వెళ్లారు. అలా ఒకరు వెంట మరొకరు నీటిలోకి దిగారు. ఇలా మొత్తం ముగ్గురు మునిగిపోయారు.
ముగ్గురు గల్లంతు
దీంతో మిగతావారు ఒడ్డుకు చేరుకొని స్థానిక పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ వీరబాబు అక్కడికి చేరుకొని పోలీసులు, ఎస్. కోట అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దింపారు. విశాఖపట్నం నుంచి ఏపీఏస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. బాలురను వెతికేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొదట ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మూడో యువకుడి మృత దేహం ఎంత సేపటికీ లభ్యం కాలేదు. బృందాలు గాలింపు చర్యలు కొనసాగించడంతో కొంత సమయానికి మూడో బాలుడి మృతదేహం కూడా లభ్యం అయింది.
మృతి చెందినవారిలో మహ్మద్ రాజక్ (14), మహ్మద్ షాహిబ్ ఖాన్ (17), మహ్మద్ ఆశ్రఫ్ (16) ఉన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. బాలురి మృతి పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రులు ఆవేదనలు వర్ణనాతీతం.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు