తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vikarabad Car Drown : వికారాబాద్ లో విషాదం- చెరువులోకి దూసుకెళ్లిన కారు, సాఫ్ట్ వేర్ ఇంజినీరు గల్లంతు!

Vikarabad Car Drown : వికారాబాద్ లో విషాదం- చెరువులోకి దూసుకెళ్లిన కారు, సాఫ్ట్ వేర్ ఇంజినీరు గల్లంతు!

HT Telugu Desk HT Telugu

25 December 2023, 13:02 IST

    • Vikarabad Car Drown : వికారాబాద్ జిల్లాలో కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక యువకుడు గల్లంతయ్యాడు. హైదరాబాద్ నుంచి ఐదుగురు స్నేహితులు కారులో అనంతగిరి హిల్స్ వెళ్తున్నారు. మార్గమధ్య ఈ ప్రమాదం జరిగింది.
చెరువులోకి దూసుకెళ్లిన కారు
చెరువులోకి దూసుకెళ్లిన కారు

చెరువులోకి దూసుకెళ్లిన కారు

Vikarabad Car Drown : వికారాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ ను చూసేందుకు హైదరాబాద్ నుంచి ఐదుగురు స్నేహితులు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరారు. ఐదుగురు స్నేహితుల్లో నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది. కాగా వీరు వికారాబాద్ జిల్లా శివారెడ్డి పేట సమీపంలోకి చేరుకోగానే పొగ మంచుకు రోడ్డు సరిగ్గా కనిపించక కారు అదుపు తప్పి ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. కారులో రఘు, మోహన్, సాగర్, గుణశేఖర్ తో పాటు పూజిత ఉన్నారు.

ఇదీ జరిగింది?

రఘుకి ఈత రావడంతో సాగర్, మోహన్, పూజితలను సురక్షితంగా చెరువు నుంచి బయటికి తీసుకొచ్చాడు. గుణశేఖర్ అనే వ్యక్తి కారుతో సహా చెరువులో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో చెరువులో అదృశ్యమైన గుణశేఖర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మునిగిన కారును బయిటికి తీసినప్పటికీ గుణశేఖర్ ఆచూకీ లభించలేదు. కారు ఇరువైపులా డ్యామేజ్ కావడంతో వేరే వాహనం ఎదైనా కారును ఢీ కొట్టిందా? అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

అంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగులే

శీతాకాలం అవ్వడంతో అనంతగిరి హిల్స్ వద్ద విపరీతమైన పొగ మంచు కమ్ముకుని ఉంటుంది. ఈ పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనం కనిపించక కారు నేరుగా చెరువులోకి వెళ్లి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగులని, తెల్లవారుజామున 3 గంటలకు మాదాపూర్ నుంచి బయలు దేరామని స్నేహితుల్లో ఒకరు తెలిపారు. కాగా ఒక బస్సు వెనక నుంచి వచ్చి తమ కారును ఢీ కొట్టడంతో కారు చెరువులోకి దూసుకెళ్లిందని పూజిత అనే అమ్మాయి చెబుతుంది. పోలీసులు దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం