JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
19 May 2024, 14:27 IST
- JD Lakshmi Narayana : ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, సీఎం జగన్ పై విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కదిద్దాల్సిన పరిస్థితుల్లో సీఎం విదేశీ పర్యటన సరికాదన్నారు.
అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ
JD Lakshmi Narayana : ఏపీలో పోలింగ్ అనంతరం పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సీఎం జగన్ విదేశీ పర్యటన, హింసాత్మక ఘటనలపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఉద్రిక్త పరిస్థితుల సమయంలో సీఎం జగన్ రాష్ట్రంలో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదన్నారు. మంత్రులు కూడా ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాజకీయాల్లో పగలు, ప్రతీకారాలు సరికాదన్నారు. రాజకీయ పార్టీలు పగలు పేరిట కొట్టుకోవడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు.
డబ్బే ప్రధానంగా ఎన్నికలు
పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం గర్హనీయమని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రోడ్లపై రాడ్లు పట్టుకుని దాడులు చేయడం లైవ్‌లో చూశామన్నారు. ఆయా పార్టీల నేతలు దాడులను నియంత్రించలేకపోయాయని ఆరోపించారు. ఇలా దాడులు చేసిన వారిని ఆయా రాజకీయ పార్టీలు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పోలింగ్ రోజున 144 సెక్షన్ ఉన్నా సరిగ్గా అమలు కాలేదన్నారు. చట్టాన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు తమ చేతుల్లోకి తీసుకోకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు డబ్బే ప్రధానంగా జరిగాయన్నారు. గెలుపే లక్ష్యంగా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారన్నారు. జూన్ 4న కౌంటింగ్ అని, ఆ రోజు కూడా శాంతి భద్రతల విషయంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు. ఏపీలో అల్లర్లపై సిట్ త్వరగా విచారణ జరిపి ఈసీకి నివేదిక ఇవ్వాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
వేగంగా సిట్ దర్యాప్తు
పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యులతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై త్వరతిగతిన విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సిట్ ను ఆదేశించారు. దీంతో సిట్ అధికారులు రంగంలోకి దిగారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ విచారణ చేపట్టింది. తాడిపత్రి, నరసరావు పేట, తిరుపతిలో శనివారం సిట్ బృందం విచారణ చేసింది. అల్లర్లపై నమోదైన కేసులు, కేసులు నమోదైనా అరెస్ట్ కాని నేతల వివరాలు, సీసీ కెమెరాల వీడియోలు పరిశీలిస్తుంది. అల్లర్లపై కొన్ని కొత్త కేసులు నమోదు చేస్తుంది. రెండ్రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. దీంతో ఇవాళ సాయంత్రానికి నివేదికను అందించేలా సిట్ పనిచేస్తోంది. తిరుపతిలో టీడీపీ అభ్యర్థిపై జరిగిన దాడి ఘటనను సీన్ రీక్రియేషన్ చేసి, విచారించింది సిట్ బృందం. అదే విధంగా ఎన్నికల తర్వాత జరిగిన ఘటనపై పోలీసు అధికారులను సైతం విచారణ చేస్తుంది. ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులతో పాటు అల్లర్లకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ లను సిట్ అధికారులు పరిశీలించారు. నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో సిట్ బృందం దర్యాప్తు చేసింది. అల్లర్లకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు.