Palnadu 144Section: పల్నాడులో ఆగని అల్లర్లు, అమల్లోకి 144 సెక్షన్, పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
Palnadu 144Section: ఏపీలో పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత తలెత్తిన హింస అదుపులోకి రాలేదు. రెండు ప్రధాన పార్టీల మధ్య తలెత్తిన ఘర్షణలతో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
Palnadu 144Section: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు ఇంకా అదుపులోకి రాలేదు. వరుసగా రెండోరోజూ కూడా గొడవలు జరగడంతో ఎన్నికల సంఘం 144 సెక్షన్ అమలుకు ఆదేశించింది.
ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. నరసరావుపేట లోక్‌సభతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు.
జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడరాదని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. పల్నాడులో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఈసీ జోక్యం చేసుకుంది. అనంపురం, పల్నాడు జిల్లాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా గొడవలు కొనసాగాయి.
టీడీపీ, వైసీపీ పక్షాల మధ్య జరిగిన అల్లర్లతో పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. దీంతో పల్నాడు జిల్లాలో సెక్షన్ 144 విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పల్నాడు జిల్లాకు అదనపు బలగాలు తరలించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
పల్నాడు జిల్లాలోని మాచర్లతో పాటు పలు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లాలో నిషేదాజ్ఞలు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైసీపీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు టీడీపీ నేతల్ని టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
పల్నాడు గొడవలపై డీజీపీతో పాటు గవర్నర్ లేఖలు రాశారు. పల్నాడులో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. మాచర్లలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో అలెర్టైన పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు.
ఈసీ ఆదేశాలతో పారామిలటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు డీజీపీ పంపారు. మాచర్ల పట్టణంతో పాటు, గ్రామాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యిమంది అదనపు బలగాలను పల్నాడు జిల్లాకు తరలించారు. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు, వ్యాపార దుకాణాలపై దాడులు చేశారని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
తిరుపతిలో ఉద్రిక్తత…
అటు తిరుపతిలో కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పులివర్తి నాని వాహనాలపై భారీ సుత్తులు, గొడ్డళ్లతో దాడులకు పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేయని పోలీసులు బాధితులపైనే కేసుపెట్టారిన ఆరోపిస్తూ పులివర్తి నాని భార్య ఆందోళనకు దిగారు. తిరుచానూరు పీఎస్ ముందు పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ధర్నాకు దిగారు.
అనంతపురంలో అలజడి….
అనంతపురంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి జేసీ నివాసంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. జేసీ అనుచరులపై దాడి చేసిన అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడులను జేసీ దివాకర్ రెడ్డి ఖండించారు. తమ ఇంట్లో ఇద్దరు పేషెంట్లు ఉన్నారని, ఇద్దరూ మంచంపై లేవలేని స్థితిలో ఉన్నారని వారికి మందులు ఇచ్చేందుకు కూడా ఎవ్వరు లేరన్నారు. పని మనుషులను కూడా పోలీసులు తీసుకెళ్లిపోయారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.