HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  4 రోజుల క్రితం అదృశ్యం.. ఫార్మా కంపెనీ ట్యాంకులో మృతదేహం లభ్యం

4 రోజుల క్రితం అదృశ్యం.. ఫార్మా కంపెనీ ట్యాంకులో మృతదేహం లభ్యం

HT Telugu Desk HT Telugu

13 September 2024, 8:35 IST

    • అన‌కాప‌ల్లి జిల్లాలో విష‌ద ఘ‌ట‌న చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం అదృశ్యం అయిన ఫార్మ ఉద్యోగి ఫ్యాక్టరీ ట్యాంకులో శ‌వ‌మై తేలారు. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.
4 రోజుల క్రితం అదృశ్యం.. ఫార్మా కంపెనీ ట్యాంకులో మృతదేహం లభ్యం
4 రోజుల క్రితం అదృశ్యం.. ఫార్మా కంపెనీ ట్యాంకులో మృతదేహం లభ్యం

4 రోజుల క్రితం అదృశ్యం.. ఫార్మా కంపెనీ ట్యాంకులో మృతదేహం లభ్యం

అన‌కాప‌ల్లి జిల్లా వ‌ర‌వాడలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో గల అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మ కంపెనీలో అదృశ్యం అయిన ఉద్యోగి గురువారం శవ‌మై క‌నిపించారు. కంపెనీలోని మిథ‌నాల్ ట్యాంక్‌లో ఆయ‌న మృత‌దేహం బ‌య‌ట‌ప‌డింది. విజ‌య‌న‌గ‌రం జిల్లా వేపాడ మండ‌లం వీలుప‌ర్తి గ్రామానికి చెందిన రంది సూర్య‌నారాయ‌ణ (40) అడ్మిరాన్ కంపెనీలో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఆయ‌న గాజువాక‌లోని శ్రామిక‌న‌గ‌ర్‌లో భార్య బాల‌ప‌ర‌మేశ్వ‌రి, కుమార్తె జ్యోషిత‌, కుమారుడు సృజ‌న్‌తో క‌లిసి ఉంటున్నారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌న‌ర‌ల్ డ్యూటీలో విధుల నిర్వ‌హ‌ణ‌కు రంది సూర్య‌నారాయ‌ణ వెళ్లారు. ఆ త‌రువాత ఆయ‌న కంపెనీ నుంచి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో సూర్య‌నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందారు. మ‌రోవైపు కంపెనీ యాజ‌మాన్యం తీరు ప‌ట్ల ప‌లు అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. సూర్యనారాయ‌ణ వాహ‌నం కంపెనీ వ‌ద్దే ఉండటంతో కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చింది. కంపెనీ బ‌యోమెట్రిక్ హాజ‌రులో కంపెనీ లోప‌లికి వెళ్లిన‌ట్లు మాత్ర‌మే న‌మోదు కావ‌డం, విధులు ముగించుకుకొని బ‌య‌ట‌కు వ‌చ్చే హాజ‌రు ప‌ట్టిక‌లో అవుట్ లేక‌పోవ‌టం, కంపెనీ యాజ‌మాన్యం ఎటువంటి విష‌య‌మూ చెప్ప‌క‌పోవ‌డంతో అనుమానాలు మ‌రింత పెరిగాయి.

దీంతో కుటుంబ స‌భ్యుల‌తో భార్య ప‌ర‌వాడ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదు మేరకు ప‌ర‌వాడ సీఐ మ‌ల్లికార్జున రావు అదృశ్య కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు ప్రారంభించారు. మ‌రోవైపు కుటుంబ స‌భ్యులు కంపెనీ ఎదుట బైఠాయించారు. కంపెనీ గోడ దూకి బ‌య‌ట‌కు వెళ్లిపోయి ఉంటాడ‌ని కంపెనీ ప్ర‌తినిధులు చెప్ప‌డంతో కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గురువారం కంపెనీలో త‌నిఖీలు చేప‌ట్ట‌గా 20 కేఎల్ సామ‌ర్థ్యం గ‌ల మిథ‌నాల్ స్టోరేజ్ ట్యాంక్‌లో సూర్య‌నారాయ‌ణ‌ శ‌వ‌మై క‌నిపించాడు. దీనికి మ్యాన్‌హోల్ క‌వ‌ర్ బోల్టు ఎప్పుడూ బిగించే ఉంటుంది. అవ‌స‌ర‌మైన‌ప్పుడు మెకానిక్‌లు మాత్ర‌మే మ్యాన్‌హోల్ క‌వ‌ర్ బోల్ట్‌ను ఓపెన్ చేసి లోప‌లికి వెళ్తుంటారు. అయితే ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ మృత దేహం దీనిలో ఉండ‌టం ప‌ట్ల ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

డీఎస్పీ కేవీ సత్య‌నారాయ‌ణ‌, సీఐతో పాటు మృతుడి కుటుంబ స‌భ్యులు చేరుకుని రాంకీ అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయంతో మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. కంపెనీలో ఏదో ప్ర‌మాదం జ‌రిగితే మృత‌దేహాన్ని ట్యాంకు లోప‌ల ప‌డేశార‌ని మృతుడి బంధువులు, కార్మిక సంఘాల నేత‌లు ఆరోపిస్తున్నారు. ఘ‌టనా స్థ‌లానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్య‌క్షులు గ‌నిశెట్టి స‌త్య‌నారాయ‌ణ‌, ప‌ర‌వాడ జెడ్‌పీటీసీ స‌భ్యులు ఎస్‌.రాజు చేరుకున్నారు. అనుమానాస్ప‌దంగా మృతి చెందిన ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ కుటుంబానికి రూ.కోటి న‌ష్టప‌రిహారం చెల్లించాల‌ని, ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు.

ప‌ర‌వాడ సీఐ ఆర్‌. మ‌ల్లికార్జున రావు త‌న సిబ్బందితో వ‌చ్చి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి విచార‌ణ చేప‌డ‌తామ‌ని సీఐ తెలిపారు. కాగా, మృతుని కుటుంబానికి రూ.50 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారంతో పాటు ద‌హ‌న ఖ‌ర్చుల‌కు ల‌క్ష రూపాయ‌లు ఇచ్చేందుకు యాజ‌మాన్యం అంగీక‌రించింది.

సంఘటనా స్థలానికి పరవాడ సిఐ ఆర్‌.మల్లికార్జునరావు తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడతామని సిఐ తెలిపారు. కాగా, మృతుని కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, దహన ఖర్చులకు లక్ష రూపాయలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది.

-జ‌గ‌దీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్