Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... డిసెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే..!
28 November 2024, 16:49 IST
- Tirumala Tirupati Devasthanam Updates : వచ్చే డిసెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది. డిసెంబర్ 15వ తేదీన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరగనుంది.
తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు
డిసెంబర్ లో జరిగే విశేష ఉత్సవాలు….
- డిసెంబర్ 01న శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం.
- డిసెంబర్ 11న సర్వ ఏకాదశి.
- 12న చక్రతీర్థ ముక్కోటి.
- 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.
- 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- డిసెంబర్ 15వ తేదీన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం.
- 16న ధనుర్మాసారంభం.
- 26న సర్వ ఏకాదశి.
- 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు - వైభవంగా ధ్వజారోహణం:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు.
అనంతరం ఉదయం 6.30 గంటలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు.
అనంతరం ఈవో జె.శ్యామలరావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈవో శ్యామల రావు మీడియాతో మాట్లాడుతూ… గురువారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు.
ఈ సందర్భంగా చెన్నైకు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డిఎల్ వసంత కుమార్ తదితరులు అమ్మవారికి కానుకగా ఆరు గొడుగులను ఈవోకు అందజేశారు. ఇదిలా ఉండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.