TTD Brahmotsavalu 2024 : ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 8 రోజుల్లో హుండీ ఆదాయం ఎంతో తెలుసా..!
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి అయ్యాయని టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసినట్లు తెలిపారు.
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శనివారం రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాటి ఆసౌకర్యాం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందించిట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల్లో నమోదైన వివరాలు:
- బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 6 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 15 లక్షల మంది భక్తులు శ్రీవారి వాహన సేవలు వీక్షించారు.
- గరుడసేవనాడు 82,043 మంది దర్శించుకున్నారు. కాగా, గరుడసేవలో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
- 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉండగా… మొత్తం 30 లక్షల లడ్డూలను విక్రయించారు.
- హుండీ కానుకలు రూ.26 కోట్లు వచ్చాయి.
- తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.60 లక్షలు.
- బ్రహ్మోత్సవాల్లో 475 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించారు.
- బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 26 లక్షల భోజనాలు, అల్పాహారం అందించారు.
- గరుడసేవనాడు 8.71 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3.47 లక్షల మందికి టి, కాఫి, పాలు, బాదం పాలు, 4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 4 లక్షల తాగునీరు బాటిళ్ళు, స్నాక్స్‌గా సుండలు, బిస్కెట్లు అందించడం జరిగిందని ఈవో శ్యామలరావు వివరించారు.
- 68 వేల మందికి పైగా భక్తులకు వైద్యసేవలు అందాయి.
- హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 18 రాష్ట్రాల నుండి వచ్చిన 261 కళాబృందాల్లో 6,884 మంది కళాకారులు కళారూపాలను ప్రదర్శించారు.
- బ్రహ్మోత్సవాలలో 40టన్నులు పుష్పాలు, 3.50 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించారు.
- దాదాపు 7 రాష్ట్రాల నుండి విచ్చేసిన 4 వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించారు.
- తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుండి మరోక ప్రాంతానికి ఉచితంగా రవాణా చేసేందుకు 14 ధర్మ రథాలను ఏర్పాటు చేశారు.
- 9.53 లక్షల మంది ఎపిఎస్‌ఆర్‌టిసి ద్వారా తిరుమలకు రాక పోకలు సాగించారు.
- గరుడసేవనాడు ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2,764 ట్రిప్పుల్లో 97,402 మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 2,711 ట్రిప్పుల్లో 89,181 మంది భక్తులను చేరవేశాయి.