TTD College Admission : టీటీడీ డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు.. 9వ తేదీ వరకే ఛాన్స్
TTD College Admission : టీటీడీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. టీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల 9వ తేదీ వరకే స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నట్టు అధికారులు వివరించారు. ఆసక్తి ఉన్నవారు కాలేజీల్లో సంప్రదించాలని సూచించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న.. శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల(అటానమస్), శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల (అటానమస్), శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల(అటానమస్), ఎస్వీ ప్రాచ్య(ఓరియంటల్) కళాశాల, ఎస్వీ సంగీత నృత్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులు.. ఇవాళ్టి నుంచి 9వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని టీటీడీ సూచించింది. స్పాట్ అడ్మిషన్లు పొందిన వారికి హాస్టల్ వసతి, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. స్పాట్ అడ్మిషన్ సమయంలో.. సిబ్బంది అన్ని విషయాలను వివరిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు.
గరుడ వాహనంపై శ్రీవారు..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఈ నెల 8వ తేదీ సాయంత్రం శ్రీమలయప్ప స్వామి.. విశేషమైన గరుడ వాహనంపై విహరిస్తారని టీటీడీ ఈవో వెల్లడించారు. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గరుడ సేవ ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని.. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులకు సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తామని వివరించారు.
భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను అక్టోబరు 7వ తేదీ రాత్రి 9 గంటల నుండి అక్టోబరు 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు రద్దు చేసినట్టు ఈవో వివరించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రజారవాణాను వినియోగించుకోవాలని కోరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు అదివారం నాడు తిరుమలలోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన రవి ప్రభ, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, ముని శంకర కృష్ణ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రంగనాథన్ ” తైతిరియోపనిషత్ – సామాజిక సందేశం” అనే అంశంపై ఉపన్యసించారు.