TTD Kartika Deepotsavam : నవంబరు 18న తిరుపతిలో 'కార్తీక దీపోత్సవం' - భారీగా ఏర్పాట్లు
TTD Kartika Deepotsavam 2024: టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోవత్సవం జరగనుంది. నవంబర్ 18వ తేదీన తిరుపతిలో జరిగే ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన కార్తీక దీపోవత్సవం జరగనుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో ఇందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ… హెచ్ డీపీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రాలేని భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని సూచించారు.
ఇందులో భాగంగా మహిళలు కూర్చుని దీపాలు వెలిగించేలా దీపపు దిమ్మెలు, నేతి వత్తులు ఏర్పాటు చేస్తున్నారు. మైదానం మొత్తం తివాచీలు, ఒక్కో దీపపు దిమ్మె వద్ద తులసి మొక్కను ఉంచనున్నారు. కార్యక్రమం అనంతరం మహిళలకు ఈ మొక్కలను అందిస్తారు.
వేదికను శోభాయమానంగా పుష్పాలతో, విద్యుత్ దీపాలు, వేదిక ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీపూజకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిటిడి పరిపాలనా భవనం ప్రధాన ద్వారాల నుంచి ఆవరణం మొత్తం అరటి చెట్లు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు.
నేడు కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ:
మరోవైపు ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో రాత్రి కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేసింది.