తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : ఈ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే..!

Tirumala : ఈ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే..!

02 August 2024, 14:40 IST

google News
    • Tirumala Tirupati Devasthanam Updates : ఈ ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను వెల్లడించింది టీటీడీ. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది.
ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు
ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు

ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు

Special Festivals at Tirumala 2024: ఈ నెలలో(ఆగస్టు మాసం) తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. ఆగ‌స్టు 27న శ్రీ‌కృష్ణాష్ట‌మి, తిరుమ‌ల శ్రీ‌వారి ఆస్థానం ఉంటుందని తెలిపింది.⁠ ⁠ఆగస్టు 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ ఉంటుందని పేర్కొంది.

ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు

  • ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.
  • ⁠ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.
  • ⁠ఆగస్టు 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ.
  • ⁠ఆగస్టు 10న కల్కి జయంతి.
  • ⁠ ⁠ఆగస్టు 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి.
  • ⁠ ⁠ఆగస్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
  • ⁠ ⁠ఆగస్టు 15న భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం. స్మార్త ఏకాదశి.
  • ⁠ ⁠ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.
  • ⁠ ⁠ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం. నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం.
  • ⁠ ⁠ఆగస్టు 19న శ్రావణపౌర్ణమి. పౌర్ణమి గరుడ సేవ. రాఖీ పండుగ. హయగ్రీవ జయంతి. విఖ‌న‌స మ‌హాముని జ‌యంతి.
  • ఆగస్టు 20నతిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు. గాయత్రీ జపం.
  • ఆగ‌స్టు 27న శ్రీ‌కృష్ణాష్ట‌మి, తిరుమ‌ల శ్రీ‌వారి ఆస్థానం.
  • ⁠ఆగ‌స్టు 28న శ్రీ‌వారి శిక్యోత్స‌వం.

పుష్కరిణి మూసివేత…..

తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిని తాత్కాలికంగా కొద్దిరోజుల పాటు మూసివేయనున్నారు. నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దు.

సాధారణంగా స్వామి పుష్క‌రిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదు. పుష్క‌రిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్త‌మ రీసైక్లింగ్ వ్య‌వ‌స్థ‌ అందుబాటులో ఉంది. నిరంత‌రాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్క‌రిణిలో నీటిని తొల‌గించి చిన్న చిన్న మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తి చేస్తారు.

పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొల‌గిస్తారు. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్క‌రిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.

డయల్ ఈవో కార్యక్రమం…

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. 

⁠ ⁠ఈ ఏడాది అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబరు చివరినాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.

 

తదుపరి వ్యాసం