Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణి మూసివేత
Tirumala : ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల ముందు శ్రీవారి పుష్కరిణికి మరమ్మతులు చేయడం ఆనవాయితీ. ఈ మేరకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Tirumala : తిరుమల శ్రీవారి పుష్కరిణి ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు మూసివేయనున్నారు. ఆలయ ట్యాంక్, స్వామి పుష్కరిణి శుభ్రపరచడం, పునరుద్ధరణ పనుల కోసం ఆగస్టు 1 నుంచి 31 వరకు ఒక నెల పాటు మూసివేయనున్నట్లు టీటీడీప ప్రకటించింది. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణి మరమ్మతులు, శుభ్రత పనులు చేపట్టడం ఆనవాయితీ. పుష్కరిణిలోని మొత్తం నీటిని తీసివేయడం, బురద తొలగింపు, మెట్లను శుభ్రపరచడం, చెత్తను తొలగింపు, పైపులకు పెయింటింగ్ వేయడం, దెబ్బతిన్న పాయింట్లను మరమ్మతు చేయడం వంటి పనులు చేయనున్నారు. పనులు పూర్తయ్యే వరకు పుష్కరిణి మూసివేస్తారని, భక్తులు గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.
రెండు డస్ట్ బిన్ల విధానం
తిరుమలలోని అన్ని హోటళ్లలో వ్యర్థాలను పారవేసేందుకు రెండు బిన్ల వ్యవస్థ తప్పనిసరి అని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు. అన్ని హోటళ్లలో ఫిర్యాదులు/సూచనల బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో పెద్ద, చిన్న హోటళ్లతోపాటు అన్ని తినుబండారాలలో వ్యర్థాలను తొలగించేందుకు రెండు డస్ట్ బిన్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. భక్తుల నుంచి అభిప్రాయాన్ని పొందడానికి కంప్లయింట్/సూచనల పెట్టెను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని మీటింగ్ హాలులో జనతా క్యాంటీన్లు, ఏపీటీడీసీ హోటళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
సింథటిక్ కలర్స్ నిషేధం
తిరుమలలోని అన్ని హోటళ్లలో చెత్తను తడిచెత్త, పొడి చెత్తగా సేకరించి తమ హోటల్ ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా తరచూ వాటిని పారవేయాలని ఈవో ఆదేశించారు. హోటల్‌లు డిస్ ప్లే బోర్డ్‌లలో ప్రతి రెసిపీ ధరలతో పాటు మార్గదర్శకాలను ప్రదర్శించాలి. ఆహార పదార్థాలలో సింథటిక్ రంగులు/నిషేధించిన రంగులు ఉపయోగించకూడదన్నారు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి టేస్టింగ్ సాల్ట్ ఉపయోగించకూడదని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారికి హోటల్ సబ్ లీజుకు ఇవ్వకూడదని నిర్ణయించారు.
తిరుమలలోని క్యాంటీన్లకు ఫుడ్ సేఫ్టీ శిక్షణ
పెద్ద, జనతా క్యాంటీన్‌లు తప్పనిసరిగా తమ హోటళ్ల పేర్లను ప్రదర్శించాలని ఈవో శ్యామలరావు సూచించారు. హోటల్‌లు సవరించిన ధరలను టీటీడీ రెవెన్యూ విభాగానికి సమర్పించాలన్నారు. తిరుమలలోని అన్ని క్యాంటీన్లకు ఆగస్టు 5 తర్వాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఫోస్టాక్ శిక్షణ ఇస్తుందన్నారు. అనంతరం క్యాంటీన్లు, తినుబండారాలను తనిఖీ చేస్తారన్నారు. వాటర్ బాటిళ్లను కూడా రూ.20కి మించి విక్రయించకూడదన్నారు. తనిఖీ సమయంలో ఎవరైనా నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలినా, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అనంతరం అన్నప్రసాదం, డోనర్ సెల్, ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, సమస్యలను కూడా సమీక్షించారు.
సంబంధిత కథనం