Tirumala Prank Video : తిరుమలలో ప్రాంక్ వీడియో- తమిళ యూట్యూబర్ అరెస్టు
Tirumala Prank Video : తిరుమలలో ప్రాంక్ వీడియో చేసిన తమిళ యూట్యూబర్, అతడి స్నేహితుడిని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Tirumala Prank Video : తిరుమలలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రాంక్ వీడియోలు చేసిన తమిళనాడు యూట్యూబర్, అతడి స్నేహితుడిని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల సర్వదర్శనం క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు చేసిన తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యూట్యూబర్ వి. వైకుంఠవాసన్ (వీవీవాసన్), ఇతని స్నేహితుడు గోవిందరాజ రామస్వామిని తిరుమల టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
వైకుంఠవాసన్, గోవిందరాజ రామస్వామి తిరుమల సర్వదర్శనం క్యూలైన్ తలుపులు తీస్తున్నట్లు ప్రాంక్ వీడియోలు తీశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్య మాల్లో వైరల్ కావడం, భక్తుల నుంచి పెద్దఎత్తున అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఆలయ గౌరవానికి భంగం కలిగించడం, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, శాంతిభద్రతల సమస్యకు కారణమవడం వంటి వాటిపై టీటీడీ సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారి తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐ సత్యనారాయణ నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను తిరుమలకు తీసుకువచ్చాక పూర్తిగా విచారించి వీడియో చేయడానికి గల కారణాలు, అసలు ఉద్దేశాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా మరిన్ని సెక్షన్లు జోడిస్తామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
అసలేం జరిగింది?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తుల్ని ఆటపట్టించేలా యూట్యూబర్ చేసిన ప్రాంక్ వీడియో వైరల్‌గా మారడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. పట్టిష్టమైన భద్రత, నిఘా ఉండే ప్రదేశంలో యువకులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ అధికారులు స్పందించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిబ్బందికి ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను తమిళనాడు పంపారు. కొద్దిరోజుల కిందట తమిళనాడుకు చెందిన యూట్యూబర్ వీవీ వాసన్‌తో పాటు అతని మిత్రులు తిరుమలకు వచ్చారు. వాసన్ మిత్రుడు నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులను ఆటపట్టించేలా వీడియో చేశాడు. క్యూ లైన్‌లో వెళుతున్న వారిని వేచి ఉంచే కంపార్ట్‌మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా నటించాడు.
తాళాలు తీస్తున్నట్టు నటించడంతో దానిని నిజమేనని నమ్మిన భక్తులు కంపార్టుమెంట్ గేట్లు తీస్తాడనుకొని ఒక్కసారిగా పైకి లేచి, గేట్ల వైపు ఉరికారు. ఆ తర్వాత అతను నవ్వుతూ వెనక్కి పరుగులు తీశాడు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తమిళనాడులో బాగా వైరల్ అయింది. ఈ వ్యవహారంపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ ప్రకటించింది. టీటీడీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వాసన్‌తో పాటు అతనికి సహకరించిన వారిని పట్టుకోడానికి ప్రత్యేక బృందాన్ని తమిళనాడుకు పంపారు. సోమవారం వారిని అరెస్టు చేశారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే క్యూలైన్లలోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ క్యూలైన్లలో ఎలా వచ్చిందనే సందేహాలు తలెత్తాయి. టీటీడీ భద్రతలో లోపాలను బయటపెట్టాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుకెళ్లేందుకు అనుమతి ఉండదు. తమిళనాడుకు చెందిన యూట్యూబర్ సిబ్బంది కళ్లుగప్పి మొబైల్‌ఫోన్ తీసుకెళ్లి ప్రాంక్ వీడియోని చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడు దానిని తన ఇన్‌స్ట్రాగాం పేజీలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.
యూట్యూబర్ క్షమాపణలు
తిరుమల క్యూలైన్‌లో ప్రాంక్ వీడియో భక్తుల మనోభావాలను దెబ్బతీసిన తమిళ యూట్యూబర్ వీవీ వాసన్ క్షమాపణలు చెబుతూ శనివారం ఓ వీడియో విడుదల చేశారు. తాము శ్రీవారి భక్తులమేనని, భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తుండగా స్నేహితుడు చేసిన చర్యలు కొందరి మనోభావాలను దెబ్బతీశాయన్నారు. దీనికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామన్నారు. ఇకపై అలాంటి వీడియోలను తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
సంబంధిత కథనం