Tirumala PrankVideo: తిరుమల క్యూలైన్లలో యూ ట్యూబర్ ప్రాంక్ వీడియో, నిబంధనల ఉల్లంఘించిన వారిపై చర్యలకు టీటీడీ ఆదేశం
Tirumala PrankVideo: కట్టుదిట్టమైన భద్రత, తనిఖీలు ఉండే తిరుమల శ్రీవారి క్యూలైన్లలో తమిళనాడుకు చెందిన యూట్యూబర్ ప్రాంక్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది.
Tirumala PrankVideo: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తుల్ని ఆటపట్టించేలా యూట్యూబర్ చేసిన ప్రాంక్ వీడియో వైరల్‌గా మారడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. పట్టిష్టమైన భద్రత, నిఘా ఉండే ప్రదేశంలో యువకులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో టీటీడీ అధికారులు స్పందించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిబ్బందికి ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను తమిళనాడు పంపారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తుల్ని ఆటపట్టించేలా ఓ ట్యూబర్ ప్రాంక్ వీడియో తీసి దానిని సోసల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొద్దిరోజుల కిందట తమిళనాడుకు చెందిన యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్‌తో పాటు అతని మిత్రులు తిరుమలకు వచ్చారు. వాసన్ మిత్రుడు నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులను ఆటపట్టించేలా వీడియో చేశాడు. క్యూ లైన్‌లో వెళుతున్న వారిని వేచి ఉంచే కంపార్ట్‌మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా నటించాడు.
తాళాలు తీస్తున్నట్టు నటించడంతో దానిని నిజమేనని నమ్మిన భక్తులు కంపార్టుమెంట్ గేట్లు తీస్తాడనుకొని ఒక్కసారిగా పైకి లేచి, గేట్ల వైపు ఉరికారు. ఆ తర్వా అతను నవ్వుతూ వెనక్కి పరుగులు తీశాడు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తమిళనాడులో బాగా వైరల్ అయింది. ఈ వ్యవహారంపై భక్తుల నుంచి విమర్శలూ రావడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని గురువారం ప్రకటించింది. వాసన్‌తో పాటు అతనికి సహకరించిన వారిని పట్టుకోడానికి ప్రత్యేక బృందాన్ని తమిళనాడుకు పంపారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే క్యూలైన్లలోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ క్యూలైన్లలో ఎలా వచ్చిందనే సందేహాలు తలెత్తాయి. టీటీడీ భద్రతలో లోపాలను బయటపెట్టాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుకెళ్లేందుకు అనుమతి ఉండదు. తమిళనాడుకు చెందిన యూట్యూబర్ సిబ్బంది కళ్లుగప్పి మొబైల్‌ఫోన్ తీసుకెళ్లి ప్రాంక్ వీడియోని చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడు దానిని తన ఇన్‌స్ట్రాగాం పేజీలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన టీటీడీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య అని ప్రకటనలో ఖండించింది. ప్రాంక్ వీడియోలు చిత్రికరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించక ముందే భక్తుల నుండి భద్రతా సిబ్బంది మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకుంటారని టీటీడీ తెలిపింది. ఒకరిద్దరు ఆకతాయిల చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీటీడీ ప్రకటనలో పేర్కొంది. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.