Vijaya Dairy Letter To TTD : టీటీడీకి నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించడానికి సిద్ధం, తెలంగాణ విజయ డెయిరీ లేఖ
21 September 2024, 20:31 IST
- Vijaya Dairy Letter To TTD : టీటీడీకి నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ విజయ డెయిరీ ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీ ఈవోకు లేఖ రాశారు. టీటీడీకి నాణ్యమైన నెయ్యి, పాల ఉత్పత్తులు అందించడానికి విజయ డెయిరీ సంసిద్ధత వ్యక్తం చేసింది.
టీటీడీకి నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించడానికి సిద్ధం, తెలంగాణ విజయ డెయిరీ లేఖ
Vijaya Dairy Letter To TTD : టీటీడీకి పాల ఉత్పత్తులు అందించడానికి తెలంగాణ విజయ డెయిరీ సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ తెలిపింది. తెలంగాణ పశుసంవర్థక శాఖకు చెందిన విజయ డెయిరీ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఆయన టీటీడీ కార్యనిర్వహణ అధికారి జె.శ్యామలరావుకు శనివారం లేఖ ద్వారా ప్రభుత్వ ప్రతిపాధనను తెలియజేశారు. దేశ వ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెంలగాణ విజయ డెయిరీ సంస్థ ప్రసిద్ధి చెందిందన్నారు.
వినియోగదారులకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసిన చరిత్రను విజయ డెయిరీ సొంతమని లేఖలో పేర్కొన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తులలో నాణ్యతను నిర్ధారించడంతో పాటు, లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతుందని పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి విజయ డెయిరీ సంస్థ సన్నద్ధతను తెలియజేశారు. విజయ డైరీ ప్రభుత్వ సంస్థ అయినందున సరఫరాల స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
మూడు రోజుల పాటు సంప్రోక్షణ యాగం
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కల్తీ నెయ్యి శ్రీవారి ప్రసాదంలో వినియోగించారని కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారం కారణంగా సంప్రోక్షణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో మూడు రోజుల పాటు మహా శాంతియాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి ఆనంద నిలయంలో మహా శాంతియాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు. ఆ యాగంలో వేద పండితులతోపాటు రుత్వికులు పాల్గొనున్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో సమావేశమై.... ఆలయం సంప్రోక్షణపై చర్చించారు. ప్రధాన అర్చకుడు, పండితులతో ఈవో చర్చలు జరిపారు. లడ్డూ వివాదంపై నివేదికను టీటీడీ ఈవో...సీఎం చంద్రబాబును కలిసి అందజేయనున్నారు. కల్తీ వివాదం, నెయ్యి కొనుగోలు, ఇతర విషయాలను సీఎంకు వివరించనున్నారు.