Siddipet News : చేర్యాల విజయ డెయిరీలో కల్తీ పాల కలకలం- ఉప్పు, చక్కెర కలిసినట్లు గుర్తించిన అధికారులు-siddipet news in telugu vijaya dairy cheryala center milk adulterated issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet News : చేర్యాల విజయ డెయిరీలో కల్తీ పాల కలకలం- ఉప్పు, చక్కెర కలిసినట్లు గుర్తించిన అధికారులు

Siddipet News : చేర్యాల విజయ డెయిరీలో కల్తీ పాల కలకలం- ఉప్పు, చక్కెర కలిసినట్లు గుర్తించిన అధికారులు

HT Telugu Desk HT Telugu
Dec 30, 2023 06:04 PM IST

Siddipet News : సిద్దిపేట జిల్లా చేర్యాలలో విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో కల్తీపాల కలకలం రేపింది. చేర్యాల నుంచి హైదరాబాద్ వెళ్లిన ట్యాంకరులో పాలు కల్తీవని గుర్తించి వెనక్కి పంపారు అధికారులు.

కల్తీపాలు
కల్తీపాలు

Siddipet News : ప్రభుత్వ అనుబంధ 'విజయ డెయిరీ' సిద్దిపేట జిల్లా చేర్యాల పాలశీతలీకరణ కేంద్రం(బీఎంసీ)లో కల్తీపాల విషయమై కొన్నాళ్లుగా గొడవ జరుగుతోంది. ఇటీవల చేర్యాల నుంచి హైదరాబాద్ ప్రధాన కేంద్రానికి వెళ్లిన ట్యాంకరులోని పాలు కల్తీవని గుర్తించి, వెనక్కి పంపారు. ఇలా రెండుసార్లు జరగడంతో వివాదానికి దారి తీసింది. దీంతో పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు స్థానిక మేనేజర్ ను శుక్రవారం నిలదీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా చేర్యాల కేంద్రానికి శుక్రవారం తెచ్చిన పలు గ్రామాలకు చెందిన 52 డబ్బాల పాలల్లో ఉప్పు, చక్కెర కలిసిందని స్థానిక మేనేజరు అభ్యంతరం చెప్పారు. మద్దూరు మండలంలోని రెండు గ్రామాలు, కొమురవెల్లి, చేర్యాల మండలాల నుంచి ఒక్కో గ్రామానికి చెందిన పాలు ఈ డబ్బాలలో ఉన్నాయని మేనేజరు మురళి స్పష్టం చేశారు. కొంత మంది చేసిన తప్పువల్ల స్థానిక కేంద్రం నుంచి ఇటీవల హైదరాబాద్ కు తీసుకెళ్లిన ఆరు వేల లీటర్లు కల్తీ అయ్యాయని చెప్పారు. ఆ పల్లెల్లో పాలు తీసుకోమని ప్రకటించారు.

పాలలో ఉప్పు, చక్కెర

దీంతో స్థానిక పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు చేర్యాల కేంద్రానికి చేరుకుని, మేనేజరుతో వాగ్వాదానికి దిగారు. పరీక్షలు చేయకుండా ఆరోపించడం సరి కాదని, ఏ రోజుకారోజు పరీక్షలు నిర్వహించి కల్తీ ఉంటే ఆపేయాలని సూచించారు. పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని, దీనికి ఎవరు బాధ్యులని మేనేజర్ ను నిలదీశారు. దీంతో 2 గంటల పాటు వాగ్వాదం జరిగింది. చివరకు ఇక నుంచి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. కల్తీ పాలను శుక్రవారం రాత్రి పారబోశారు. ఈ విషయమై మేనేజరు మురళికి స్పందించలేదు. సిద్ధిపేట జిల్లా డైరెక్టర్ గోపాల్ సింగ్ మాట్లాడుతూ కొన్ని సెంటర్ల నుంచి ఉప్పు, చక్కెర కలిపిన పాలు వచ్చినట్లు గుర్తించింది నిజమేనని చెప్పారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల సంఘం అధ్యక్షులకు వివరించామన్నారు. ఇలాంటి సంఘటనలు పునః రావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పాడు

Whats_app_banner