Bail Canceled: వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు
27 April 2023, 12:25 IST
- Bail Canceled: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి పులివెందుల కోర్టు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5లోగా గంగిరెడ్డి సిబిఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు
Bail Canceled: వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి గతంలో పులివెందుల కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఎర్ర గంగిరెడ్డి మే 5లోపు సిబిఐ కోర్టులో లొంగిపోవాలని, లొంగిపోకపోతే సిబిఐ అరెస్ట్ చేయొచ్చని స్పష్టం చేసింది.
వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డి నాలుగేళ్లుగా బెయిల్‌పైనే ఉన్నాడు. వివేకా హత్య తర్వాత గంగిరెడ్డిని సిట్ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. 90 రోజుల్లో సిట్ ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంతో పులివెందుల కోర్టు ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్టర్ బెయిల్ మంజూరు చేసింది. సిట్ దర్యాప్తులో హత్యకు ప్రధాన కుట్రధారుడు గంగిరెడ్డి అని ఆరోపించింది. సకాలంలో ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంతో అతనికి బెయిల్ మంజూరైంది.
2019 జూన్ 27న గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నాడని సిబిఐ ఆరోపిస్తోంది. వివేకా హత్య కేసును తొలినాళ్లలో విచారించిన సిట్ బృందంతో పాటు తర్వాత ఏర్పాటైన రెండో సిట్ కూడా గంగిరెడ్డి పాత్రను నిర్దారించాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ ప్రారంభమైన తర్వాత గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంతో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయడానికి ఏపీ హైకోర్టు అనుమతించలేదు.
ఈ నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి వ్యవహారంపై సిబిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గతంలో ఏపీ హైకోర్టులో సానుకూల స్పందన లభించకపోవడాన్ని సిబిఐ వివరించింది. కేసు విచారణ పరిధిని తెలంగాణ హైకోర్టుకు మార్చడంతో గంగిరెడ్డి వ్యవహారంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. గంగిరెడ్డి బయట ఉంటూ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురు అరెస్ట్ అయ్యారు. వీరిలో ఏ1, ఏ4 దస్తగిరి బయట ఉండగా, మిగిలిన ఐదుగురు జైల్లోనే ఉన్నారు.
జూన్ 30లోగా కేసు దర్యాప్తు ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో లక్షన్నర ష్యూరిటీతో జులై 1న గంగిరెడ్డికి మళ్లీ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 2019 జూన్ 27 నుంచి బెయిల్‌పై ఉన్న గంగిరెడ్డి తాజా ఆదేశాలతో మరోసారి సిబిఐకు లొంగిపోవాల్సి ఉంది.
సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారన్న సిబిఐ…
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బయట ఉండటం వల్ల దర్యాప్తులో సహకరించడానికి ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదని సీబీఐ హైకోర్టుకు వివరించింది. గంగిరెడ్డి వెనుక రాజకీయ ప్రముఖులు ఉండటంతో ప్రజల్లో భయం ఉందని సిబిఐ ఆరోపించింది.
గంగిరెడ్డికి బెయిలును సమర్థిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసిందని సిబిఐ న్యాయవాది నాగేందర్ వివరించారు. ఏ కారణాల మీద ఎర్రగంగిరెడ్డి బెయిలు రద్దు కోరుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. వివేకా హత్య పెద్ద కుట్ర అని, పథక రచన, అమలు అంతా ఎర్ర గంగిరెడ్డే చేశారని సీబీఐ తరఫు న్యాయవాది చెప్పారు. గంగిరెడ్డి బయట ఉంటే ఇతరులు ఎవరూ దర్యాప్తునకు సహకరించరన్నారు.
సాధారణ బెయిలు, మెరిట్ ఆధారంగా బెయిలు మంజూరు చేయడం కాకుండా, చట్టపరమైన బెయిలును పొందినప్పుడు కేసు పూర్వాపరాలు, తీవ్రత, నిందితుడి పాత్రను పరిగణనలోకి తీసుకుని దాన్ని రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు కొత్తగా తీర్పిచ్చిందని సీబీఐ న్యాయవాది చెప్పారు. అందువల్ల గతంలో చెప్పిన తీర్పుల ఆధారంగా ఇందులో వాదనలు సరికాదన్నారు.
ఎర్ర గంగిరెడ్డి బెయిలు పిటిషన్ సందర్భంగా సిట్ కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారని, అసలు సిట్ సరిగా పనిచేయడం లేదని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. అది సరిగా పనిచేయకపోవడం వల్లనే సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. సిట్ కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. స్థానిక పోలీసులు ఏడాదిపాటు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లలేదన్నారు. గూగుల్ టేకౌట్ వంటి సాంకేతిక ఆధారాలున్నాయని, గంగిరెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరారు.
వివేకాను హత్య చేయడానికి మిగిలిన ముగ్గురు నిందితులను ఎర్ర గంగిరెడ్డే ఉసిగొల్పారని, మీ వెనుక నేనుంటానని వారికి భరోసా ఇచ్చి ప్రోత్సహించారని సునీత తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తెలిపారు. సాక్ష్యాలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చి, వాటిని తుడిచేయడంలో కీలకపాత్ర పోషించార[న్నారు. అందువల్ల గంగిరెడ్డికి బెయిలు పొందే అర్హత లేదన్నారు. కేసు పూర్వాపరాలను చూడాలని సుప్రీంకోర్టు కూడా పేర్కొందన్నారు. సీబీఐ దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, గంగిరెడ్డికి సంబంధించినంత వరకు పూర్తయిందని, రెండు అభియోగపత్రాల్లో అతని పాత్రను వివరించినట్లు పేర్కొన్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాక్షులను బెదిరించే అవకాశాలున్నాయని, ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే ప్రజలు వ్యవస్థపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల బెయిలును రద్దు చేయాలని కోరారు.
అంతకు ముందు ఎర్ర గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్‌పై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. పారదర్శక విచారణ కోరుతున్నామని, చట్టపరమైన బెయిలు పొందడం నిందితుడి హక్కు అని, దాన్ని రద్దు చేయరాదంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావించారు. దస్తగిరి ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకోవడం, అది పెండింగ్‌లో ఉండగానే క్షమాభిక్ష కోరడం, సీబీఐ దానికి అభ్యంతరం చెప్పకపోవడం ఈ సంఘటనలన్నింటనీ వరుస క్రమంలో చూడాలన్నారు.
మూడు విడతలుగా జరిగిన గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణలో మే 5లోగా లొంగిపోవాలని జస్టిస్ చిల్లకూరు సుమలత గంగిరెడ్డిని ఆదేశించారు.