తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Viveka Case: వివేకా హత్య గురించే జగన్ కు ముందే తెలుసు - కౌంటర్ అఫిడవిట్ లో Cbi

YS Viveka Case: వివేకా హత్య గురించే జగన్ కు ముందే తెలుసు - కౌంటర్ అఫిడవిట్ లో CBI

26 May 2023, 22:52 IST

google News
    • TS High Court On Viveka Murder Case: ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగాయి. మరోవైపు సీబీఐ తాజాగా దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సీఎం జగన్ పేరును ప్రస్తావించింది. వివేకా హత్య విషయం ఆయనకు ముందే తెలుసని సీబీఐ చెప్పటం చర్చనీయాంశంగా మారింది.
అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు
అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు

అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు

YS Viveka Murder Case Updates: వివేకా హత్య విషయం పీఏ కృష్ణారెడ్డి బాహ్య ప్రపంచానికి చెప్పడం కంటే ముందే ఏపీ సీఎం జగన్మోన్ రెడ్డికి సమాచారం అందిందని తాజా కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ పేర్కొంది. వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ హత్య జరగడానికి ముందు, తర్వాత క్రియాశీలకంగా ఉన్నందున్న హత్య సమాచారం జగన్మోహన్ రెడ్డికి చేరవేసిన విషయంపై ఇంకా విచారణ జరపాల్సి ఉందని కోర్టుకు నివేదిందించింది సీబీఐ.దీని వెనక ఉన్న ఇంకా భారీ కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై దర్యాప్తు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో అవినాశ్ రెడ్డి పొంతన లేని సమాధానాలు చెప్పారని తెలిపింది సీబీఐ. అవినాశ్ ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరింది. అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని కౌంటర్ అఫిడవిట్ లో కోర్టుకు నివేదించింది.

వాడివేడిగా వాదనలు

మరోవైపు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారించింది. వెకేషన్‌ బెంచ్‌లో వాడివేడిగా వాదనలు కొనసాగాయి. సునీతా రెడ్డి, అవినాశ్ రెడ్డి పిటిషన్లకు సంబంధించి వాదనలు వినగా… శనివారం సీబీఐ వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ... అవినాశ్ రెడ్డి విషయంలో సీబీఐ చెబుతున్న కారణాలకు సంబంధం లేదన్నారు. భాస్కర్‌రెడ్డి కోసం ర్యాలీలు జరిగితే అవినాశ్ అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏంటి? అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినాశ్ ని ఇరికించేలా కుట్ర జరుగుతోందన్నారు. వివేకా హత్యకు సంబంధించి అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటివరకు ఎక్కడా నిందితుడని చెప్పలేదని పేర్కొన్నారు. విచారణకు పిలిచిన ఏడు సార్లు హాజరయ్యారని చెప్పారు. విచారణకు సహకరించడం అంటే సీబీఐ వాళ్లు రాసిచ్చింది చెప్పడమా అని వాదనలు వినిపించారు. అసలు ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోలను హైకోర్టు ముందుంచాలని కోరారు. రూ.4కోట్లతో అవినాశ్ రెడ్డికి సంబంధమేంటని… గంగిరెడ్డి రూ.కోటి ఇచ్చాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడ.. ఆ డబ్బులు అవినాశ్ రెడ్డి ఇచ్చారని గంగిరెడ్డి చెప్పారా అని లెవనెత్తారు. హత్య చేసిన దస్తగిరిని సీబీఐ వెనకేసుకొస్తోందని అన్నారు. దస్తగిరి ముందస్తు బెయిల్ ను కూడా సీబీఐ వ్యతిరేకించలేదని ప్రస్తావించారు. గంగిరెడ్డి ఢీఫాల్ట్ బెయిల్ పై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన సునీత.. వివేకా కేసులో ఏ1గా దస్తగిరి బయట తిరుగుతుంటే మాత్రం స్పందించట్లేదన్నారు.

అనంతరం సునీతారెడ్డి తరఫు న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపించారు. సీబీఐ అధికారులు.. విశ్వ భారతి హాస్పిటల్ లోకి ఎవరినీ వెళ్లనివ్వకుండ హాస్పిటల్ ముందు అవినాశ్ అనుచరులు అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సునీత తరపు లాయర్ వాదనలు ముగియడంతో విచారణను ముగించింది కోర్టు. రేపు సీబీఐ తరపు వాదనలు వింటామని తెలిపింది.

మొత్తంగా బెయిల్ పిటిషన్ పై వాడివేడిగా వాదనలు కొనసాగటం, రేపు సీబీఐ వాదనలు వినిపించనున్న నేపథ్యంలో… అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక సీబీఐ వాదనలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తుందనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. అయితే కౌంటర్ అఫిడవిట్ లో జగన్ పేరు ప్రస్తావించటంపై వైసీపీ వర్గాలు ఖండిస్తున్నాయి. దీనిపై సజ్జల స్పందిస్తూ… ఎల్లో మీడియా స్క్రిప్ట్‌ ప్రకారమే సీబీఐ నడుస్తోందని ఆరోపించారు.

తదుపరి వ్యాసం