MP Avinash Reddy Letter : సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి మరో లేఖ- ఈ నెల 27 వరకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి
MP Avinash Reddy Letter : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో... అవినాష్ రెడ్డి సీబీఐకి మరో లేఖ రాశారు. ఈ నెల 27వ తేదీ వరకూ విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.
MP Avinash Reddy Letter : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయంలో అవినాష్ రెడ్డి సీబీఐకి మరో లేఖ రాశారు. తన అనారోగ్యం దృష్ట్యా విచారణకు హాజరుకాలేకపోతున్నాని, ఈ నెల 27వ తేదీ వరకు విచారణకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ అధికారులను కోరారు. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్న కారణంగా తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే కర్నూలులో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీని మరోసారి కోరారు. కానీ డీజీపీ నుంచి తగిన ఆదేశాలు వచ్చాకే అరెస్టుపై నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ కృష్ణకాంత్ సీబీఐ అధికారులకు తెలిపినట్లు సమాచారం.
కర్నూలులో హైటెన్షన్
సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకొని స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్‌లో వేచిఉన్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న ప్రచారంతో ఆయన అనుచరులు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఆస్పత్రి సమీపంలో దుకాణాలను తెరవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే స్థానిక పోలీసులు సహకరించకపోతే కేంద్ర బలగాల సాయంతో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఆస్పత్రి సమీపంలో దుకాణాలను తెరవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
సుప్రీంలో లభించని ఊరట
వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తలిగింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందుకు అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణకు రాగా... వేరే బెంచ్‌కు వెళ్లాలని జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం సూచించింది. అయితే జస్టిస్ సంజయ్ కరోల్, అనిరుద్ బోస్ బెంచ్ ముందుకు పిటిషన్ వెళ్లింది. అయితే ముందుగా లిస్ట్ చేసిన కేసులనే వాదిస్తామని మెన్షన్ అధికారులకు తెలిపారా అని బెంచ్ అవినాష్ రెడ్డి లాయర్లను ప్రశ్నించింది. ఈ పిటిషన్ ను అర్జెంట్‌గా విచారించాల్సి ఉందని, అందుకే మెన్షన్ అధికారులకు చెప్పలేదని వారు తెలిపారు. అయితే లిస్ట్ అయిన కేసులను మాత్రమే విచారిస్తామని ధర్మాసనం తేల్చిచెప్పింది. మెన్షన్ అధికారులను సంప్రదించి లిస్ట్ చేయించుకోవాలని చెప్పడంతో... ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాకుండా ఆగిపోయింది.
ఆందోళనకరంగా అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి
విశ్వ భారతి ఆసుపత్రి వైద్యులు అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కార్డియో సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. ఆమె వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని, అవినాష్ రెడ్డి తల్లికి వాంతులు అయినందున అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలని వెల్లడించారు. అవినాష్ రెడ్డి తల్లికి బీపీ తక్కువగా ఉన్నందున మరికొన్ని రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించాలని వైద్యులు పేర్కొన్నారు.