తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Laddu Case : దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమేంటి..? తిరుపతి లడ్డూ కేసుపై సుప్రీం విచారణ

Tirupati Laddu Case : దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమేంటి..? తిరుపతి లడ్డూ కేసుపై సుప్రీం విచారణ

HT Telugu Desk HT Telugu

03 October 2024, 18:04 IST

google News
    • Tirupati Laddu controversy Case : తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సిట్ ద‌ర్యాప్తు కొన‌సాగించాలా? లేక స్వతంత్ర సంస్థ‌తో ద‌ర్యాప్తు జ‌రిపించాలా? అనే అంశంపై కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడ‌గాల‌ని సొలిసిటర్ జ‌న‌ర‌ల్ కు సుప్రీం సూచించింది. రేపటికి విచారణ వాయిదా వేసింది.
తిరుపతి లడ్డూ కేసు - విచారణ వాయిదా
తిరుపతి లడ్డూ కేసు - విచారణ వాయిదా (ANI)

తిరుపతి లడ్డూ కేసు - విచారణ వాయిదా

తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టీటీడీ) మహా ప్ర‌సాదం ల‌డ్డూ క‌ల్తీపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ‌ను రేప‌టికి వాయిదా వేసింది. కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సొలిసిటర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా అభ్య‌ర్థ‌న‌తో చివ‌రి నిమిషంలో విచార‌ణ‌ను శుక్ర‌వారానికి సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ బీఆర్ గవాయి, జ‌స్టిస్ కేవీ విశ్వ‌నాథ‌న్‌ల‌తో కూడిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం వాయిదా వేసింది.

తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, లేదా విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డితో పలువురు దాఖలు చేసిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌, జ‌స్టిస్ కేవీ విశ్వ‌నాథ‌న్‌ల‌తో కూడిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం గురువారం విచారించింది.

అభిప్రాయం చెప్పండి….

గ‌త‌ విచార‌ణ స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద‌ర్యాప్తు కొన‌సాగించాలా? లేక స్వతంత్ర సంస్థ‌తో ద‌ర్యాప్తు జ‌రిపించాలా? అనే అంశంపై కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడ‌గాల‌ని సొలిసిటర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తాకు సుప్రీం కోర్టు సూచించింది. అంతేకాదు గురువారం లోపు అభిప్రాయం చెప్ప‌మ‌ని తుషార్ మెహ‌తాను ఆదేశించింది.

అయితే గురువారం ల‌డ్డూకు సంబంధించిన పిటిష‌న్లు సుప్రీం కోర్టులోని మూడో నెంబ‌ర్ కోర్టులో 301, 302 నెంబ‌ర్లలో జాబితా అయ్యాయి. ఈ రెండు నెంబ‌ర్ల‌లో జాబితా అయిన కేసులు గురువారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది. అయితే అదే స‌మయంలో సొలిటర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వేరే కోర్టులో ఉండ‌టంతో రేపు (శుక్ర‌వారం) మొద‌టి కేసుగా ఈ పిటిష‌న్ల‌ను విచారించాల‌ని ఆయ‌న త‌రపు న్యాయ‌వాదులు అభ్య‌ర్థించారు. అందుకు ధ‌ర్మాసనం అంగీక‌రించి విచారణ‌ను ధ‌ర్మాస‌నం రేప‌టికి వాయిదా వేసింది.

సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం

ఈ పిటిష‌న్ల‌పై గత సోమ‌వారం కూడా విచారణ జరిగింది. తిరుమల ల‌డ్డూల త‌యారీకి క‌ల్తీ నెయ్యి వినియోగించారంటూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బ‌హిరంగంగా చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేసు విచార‌ణ‌లో ఉన్న స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంలోని ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది.

క‌ల్తీ నెయ్యి వాడిన‌ట్లు ల్యాబ్ నివేదిక ప్రాథ‌మికంగా చూప‌లేద‌ని సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం మౌఖికంగా గ‌మ‌నించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్ర‌శ్నించింది. ఈ వివాదంపై సీబీఐ విచార‌ణ అవ‌స‌రమా? లేదా అనేదానిపై కేంద్ర ప్ర‌భుత్వం నుండి సూచ‌న‌లు కోరాల‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తాను ధ‌ర్మాస‌నం కోరింది.

ఎటువంటి ఆధారం లేదు….

ఈ ఆరోప‌ణ‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ద‌ర్యాప్తుకు ఆదేశించిన‌ప్పుడు ఈ అంశంపై బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవ‌స‌రం ఏమోచ్చింద‌ని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. క‌ల్తీ జ‌రిగింద‌నే వాద‌న‌ను ధ్రువీకరించ‌డానికి ఎటువంటి ఆధారం లేద‌ని పేర్కొంది. ల‌డ్డూలను త‌యారు చేయ‌డానికి జంతువుల కొవ్వును ఉప‌యోగించిన‌ట్లు ఖ‌చ్చితంగా నిర్ధారించ‌డానికి సీఎం వ‌ద్ద ఏదైనా ఆధారాలు ఉన్నాయా? అని జ‌స్టిస్ గ‌వాయ్ ప్ర‌శ్నించారు.

రిపోర్టు ప్ర‌కారం నెయ్యి న‌మూనాలు తిర‌స్క‌రించ‌బ‌డ్డాయ‌ని జ‌స్టిస్ విశ్వ‌నాథ‌న్ అన్నారు. మీరు విచార‌ణ‌కు ఆదేశించిన‌ప్పుడు మీడియా ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏంటీ? ప్ర‌శ్నించారు. క‌నీసం దేవుళ్ల‌నైనా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచండ‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్య‌నించింది. ల‌డ్డూలో క‌ల్తీ జ‌రిగింద‌ని నిర్ధారించారా? ల‌డ్డూల‌ను టెస్టింగ్‌కు పంపారా? క‌ల్తీ జ‌రిగింద‌ని గుర్తించిన త‌రువాత ఆ నెయ్యిని లడ్డూ త‌యారీలో వినియోగించారా? అలా వినియోగించిన‌ట్లు ఆధారాలు లేవు. విచార‌ణ జ‌ర‌గ‌కుండానే ల‌డ్డూ క‌ల్తీ జ‌రిగింద‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డం భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తోంది. బ‌హిరంగంగా మాట్లాడే ముందు వాటిని ప‌రీక్షించ‌డం అవ‌స‌రం కాదా? అని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.

అలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయకూడదు…

ల‌డ్డూల త‌యారీ ప్ర‌క్రియ‌లో ఆ నెయ్యిని ఉప‌యోగించిన‌ట్లు చూపించ‌డానికి ప్రాథ‌మిక ఆధారాలు లేవ‌ని పేర్కొంది. భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసి ఉండాల్సింది కాద‌ని, విచార‌ణ పెండింగ్‌లో ఉన్న‌ప్పుడు బాధ్య‌తాయుత‌మైన ప్ర‌జాప్ర‌తినిధులు అటువంటి ప్ర‌క‌ట‌న‌లు చేసిన‌ప్పుడు, అది సిట్‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? అని ప్ర‌శ్నించింది. గంట‌పాటు సుదీర్ఘంగా విచార‌ణ జ‌రిగిన అనంత‌రం ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

"ఈ పిటిష‌న్ మొత్తం ప్ర‌పంచంలో నివ‌సించే కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే మ‌నోభావాల‌కు సంబంధించిన‌ది. గ‌త పాల‌న‌లో తిరుప‌తి ల‌డ్డూల త‌యారీకి జంతువుల కొవ్వును ఉప‌యోగించార‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుకు ముందే ముఖ్య‌మంత్రి ఈ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే విచార‌ణ‌కు ఆదేశించిన‌ప్పుడు ఉన్న‌త రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తులు ప్ర‌జ‌ల ముందు మాట్లాడ‌టం స‌ముచితం కాద‌ని ప్రాథ‌మికంగా భావిస్తున్నాం. అయితే టీటీడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) కూడా ఇలాంటి క‌ల్తీ నెయ్యిని ఉప‌యోగించ‌లేద‌ని ఒక ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు కొన్ని ప‌త్రికా నివేదిక‌లు కూడా చెబుతున్నాయి. ఈ విష‌యంలో సీఎంతో టీటీడీ సీఈఓ విభేదించారు. ఇద్ద‌రు ప్ర‌క‌ట‌న‌ల‌కు పొంత‌న లేదు. టిటిడి త‌ర‌పున హాజ‌రైన సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్ధార్థ్ లూథ్రా వాద‌న‌లు ఈ అంశంపై ధ‌ర్మాస‌నం అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వలేద‌ని పేర్కొంది. మీరు ఇంకా స‌మాధానం చెప్ప‌లేదు. నెయ్యి వాడిన‌ట్లు చూపించ‌డానికి ఏమీ లేదు" అని ధ‌ర్మాస‌నం పేర్కొంది.

అయితే సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ టీటీడీ ఈఓ కొన్ని ట్యాంక‌ర్ల‌కు సంబంధించి ఆ ప్ర‌క‌ట‌న చేశార‌ని అన్నారు. దీనికి స్పందించిన ధ‌ర్మాస‌నం "మీరు మీ వైఖ‌రిని ఉంచే ముందు సూచ‌న‌లు తీసుకోండి. క‌లుషిత‌మైన నెయ్యి ఉప‌యోగించార‌ని చెప్ప‌డానికి ఏమీ లేదు. అది మీ స్వంత వైఖ‌రి కాదు. ఈ రోజు మీ వ‌ద్ద స‌మాధానం లేదు. బహిరంగ ప్ర‌క‌ట‌న‌ల‌కు అస‌లు ఆధారమే లేదు" అని ధ‌ర్మాస‌నం పేర్కొంది.

ఫిర్యాదులు ఉన్న‌ట్ల‌యితే, ప్ర‌తి ట్యాంక‌ర్ నుండి న‌మూనాలు తీసుకోవాల్సి ఉంటుంద‌ని, కొన్నింటి న‌మూనాలు కాద‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. జూన్‌లో నెయ్యిని టీటీడీకి స‌ర‌ఫ‌రాదారుడు పంపార‌ని, జూలై 4 వ‌ర‌కు అదే స‌ర‌ఫ‌రాదారుడు ఎన్‌డీడీబీకి న‌మూనాలు పంప‌లేద‌ని అన్నారు. అయితే జూలై 6, 12 తేదీల్లో స‌ర‌ఫ‌రా చేసిన ట్యాంక‌ర్ల‌లో వ‌చ్చిన నెయ్యి మాత్రమే ఎన్‌డీడీబీకి పంపామ‌ని తెలిపారు. జూలై 6 స‌ర‌ఫ‌రా చేసిన రెండు ట్యాంక‌ర్ల‌లోనూ, జూలై 12న రెండు ట్యాంక‌ర్ల‌లోనూ న‌మూనాల‌ను తీసుకున్నార‌ని అన్నారు. అది క‌ల్తీ నెయ్యి అని తేలింద‌ని, జూలై 6, జూలై 12 తేదీల్లో స‌ర‌ఫ‌రా చేసిన ట్యాంక‌ర్ల‌కు సంబంధించి టిటిడి సిఈఓ చేసిన ప్ర‌క‌ట‌న అని అన్నారు.

సుబ్ర‌మ‌ణ్య‌స్వామి త‌ర‌పు సీనియ‌ర్ న్యాయ‌వాది రాజ‌శేఖ‌ర్ రావు వాద‌న‌లు వినిపిస్తూ తాను కూడా ఒక భ‌క్తుడినేని, ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని అన్నారు. క‌ల్తీ నెయ్యికు సంబంధించి చేసిన ప్ర‌క‌ట‌న చాలా చిక్కుల‌ను క‌లిగి ఉంద‌ని, అనేక ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తుతుంద‌ని పేర్కొన్నారు.

మ‌త సామ‌ర‌స్యానికి భంగం క‌లిగిస్తుంద‌ని అన్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రాతిప‌దిక‌న అలాంటి ప్ర‌క‌ట‌న చేశార‌నేదానిపై ఆందోళ‌న చెందుతున్నామ‌ని పేర్కొన్నారు. బాధ్య‌తాయుత‌మైన వ్య‌క్తి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు ఆధారాలు ఉండాల‌ని, రాజ‌కీయ జోక్యాన్ని అనుమ‌తిస్తారా? అని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ స్పందిస్తూ వ్య‌తిరేకించారు. ఈ పిటిష‌న్లు విశ్వ‌స‌నీయ‌మైన‌వి కావ‌ని, ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై దాడి చేయ‌డానికి మాత్ర‌మేన‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సిట్‌ను నియ‌మించింద‌ని తెలిపారు.

రిపోర్టుపై రెండో అభిప్రాయం తీసుకోవాలి

ఎస్‌జి తుషార్ మెహ‌తా జోక్యం చేసుకుని ఇది విశ్వాసానికి సంబంధించిన విష‌య‌మ‌ని, ఎవ‌రు బాధ్యులు, ఏ ఉద్దేశ్యంతో చేశారో దీనిని ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. "ల్యాబ్ రిపోర్టులో కొన్ని అంశాలు అనుమతించిన‌ట్లుగా లేవు. రిపోర్టు స్ప‌ష్టంగా లేదు. మీకు జూలైలో నివేదిక వ‌చ్చింది. సెప్టెంబ‌ర్ 18న మీరు బ‌హిరంగంగా మాట్లాడారు. మీకు ఖ‌చ్చితంగా తెలియ‌పోతే, మీరు ఎందుకు బ‌హిరంగంగా మాట్లాడారు?" అని జ‌స్టిస్ విశ్వ‌నాథ‌న్ ప్ర‌శ్నించారు. ల‌డ్డూల త‌యారీలో ఆ నెయ్యి వాడారా? అని జ‌స్టిస్ గ‌వాయ్ ప్ర‌శ్నించారు.

దీనికి స్పందించిన టీటీడీ త‌ర‌పు సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్ధార్థ లూత్రా విచార‌ణకు ఆదేశించామ‌ని తెలిపారు. ఇలాంటి నివేదిక వ‌చ్చినప్పుడు , రెండో అభిప్రాయం తీసుకోవాల‌నే వివేకం లేదా? ఇందులో మొద‌టిది, ఈ నెయ్యి ఉప‌యోగించిన‌ట్లు రుజువు కాలేదు. రెండోది రెండో అభిప్రాయం తీసుకోలేదు" అని జ‌స్టిస్ విశ్వ‌నాథ‌న్ అన్నారు. దీని ప్రకారం, రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించాలా? లేదా దర్యాప్తును వేరే ఏజెన్సీకి బదిలీ చేయాలా? అనేది తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధ‌ర్మాస‌నం సూచించింది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం