TTD Brahmotsvam: బ్రహ్మోత్సవాల్లో ఒక్క రోజులోనే స్వామివారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు-ttd arrangements to have darshan of swami in one day during brahmotsavam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Brahmotsvam: బ్రహ్మోత్సవాల్లో ఒక్క రోజులోనే స్వామివారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు

TTD Brahmotsvam: బ్రహ్మోత్సవాల్లో ఒక్క రోజులోనే స్వామివారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 02, 2024 09:00 AM IST

TTD Brahmotsvam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఒక్కరోజులోనే స్వామి వారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సామన్య భక్తులకే ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సమీక్షిస్తున్న ఈవో శ్యామలరావు
తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సమీక్షిస్తున్న ఈవో శ్యామలరావు

TTD Brahmotsvam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ ఏడాది సాధారణ భక్తుల దర్శనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. స్వామి వారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో అధికారులను ఆదేశించారు.

yearly horoscope entry point

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నాయి. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తుంది.

అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహనసేవలు ప్రారంభమవుతాయి. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మరోవైపు తిరుమల బ్రహ్మోత్సవాలకు విచ్చేేసే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల కొండకు వచ్చే భక్తులకు ఒక్కరోజులోనే స్వామి వారి దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

విఐపి బ్రేక్‌ దర్శనాలు రద్దు

బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో ప్రకటించారు. వీవీఐపీలు స్వయంగా పాల్గొనేందుకు మాత్రమే అనుమతిస్తారు. గరుడ సేవ నిర్వహించే 8వ తేదీన అన్ని రకాల వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యమిస్తున్నారు.

బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం 1.32 లక్షల టికెట్లను ఆన్లైన్లో ఇప్పటికే విడుదల చేశారు. ఉత్సవాల సమయంలో సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు టైమ్ స్లాట్‌ కేటాయిస్తున్నారు. సాధారణ భక్తులకు తిరుపతిలో రోజుకు 24 వేల టోకెన్లు జారీ చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు సుమారు 80 వేల మంది స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.

ఆ రోజు లక్షమందికి దర్శనాలు…

గరుడ సేవ సందర్భంగా బ్రేక్ దర్శనాల రద్దుతో లక్ష మందికి దర్శనానికి వీలు కలుగుతుంది. గరుడ సేవ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11 వరకు నిర్వహిస్తారు. జరుగుతుంది. గరుడ సేవను తిరుమలలో రెండు లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించేలా గ్యాలరీలను సిద్ధం చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కరెంట్‌ బుకింగ్‌లో గదుల కేటాయింపు…

తిరుమలలో అందుబాటులో ఉన్న 6,200 గదుల్లో ఆన్లైన్ కోటా తగ్గించి కరెంటు బుకింగ్ ద్వారానే అందిస్తారు. వీఐపీల కోసం మరో 1300 గదులు ఉన్నాయి. మొత్తంగా బ్రహ్మోత్సవాల సమయంలో 40 వేల మందికి వసతి కల్పిస్తారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు కొండపై పలు ప్రాంతాల్లో అన్నప్రసాద కేంద్రాలను సిద్ధం చేశారు. సాధారణంగా తిరుమలలో రోజుకు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు ఇస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో మరో ఏడు లక్షల నిల్వల్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రసాదాల పంపిణీకి మరో 11 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండ కూడదని, అన్నప్రసాదం మరియు ఆరోగ్య (పారిశుద్ధ్యం) విభాగాలు రెండు ముఖ్యమైన విభాగాలుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకుని దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. “అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే, చెత్తను తొలగించడం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆలస్యం చేయకుండా ఆరోగ్య శాఖ పారిశుధ్య కార్మికులను ఆదేశించాలని అని ఆయన సూచించారు.

రాకపోకలపై నిషేధం..

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొండపైకి వచ్చే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ.. ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయనుంది..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న‌ సాలకట్ల బ్రహ్మోత్సవాలను పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది.

మంగళవారం ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు.

ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతించారు.

అక్టోబ‌రు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబ‌రు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

ar- అక్టోబ‌రు 2: మహాలయ అమావాస్య

- 3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

- అక్టోబ‌రు 4న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

- అక్టోబ‌రు 8న శ్రీవారి గరుడసేవ.

- అక్టోబ‌రు 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం.

- అక్టోబ‌రు 11న ర‌థోత్స‌వం.

- అక్టోబ‌రు 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స‌మాప్తి.

- అక్టోబ‌రు 13న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం.

- అక్టోబ‌రు 28న సర్వ ఏకాదశి.

- అక్టోబ‌రు 31న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం

Whats_app_banner