Vizianagaram : విజయనగరం జిల్లాలో దారుణం.. యువతిని అపహరించి.. ఆపై అత్యాచారం
12 October 2024, 13:46 IST
- Vizianagaram : విజయనగరం జిల్లాల్లో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని యువతిని.. తెలిసివాడే అపహరించి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుమార్తె కనిపించటం లేదని పోలీసులను ఆశ్రయిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు.
విజయనగరంలో యువతిపై అత్యాచారం
విజయనగరం సమీపంలో గొట్లాం బైపాస్ వద్ద దారుణం జరిగింది. విజయనగరం జిల్లా పాచిపెంట మండలానికి చెందిన పి.శ్రీధర్ (45) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఓ కోళ్లఫారంలో పని చేస్తున్నాడు. అక్కడే ఉంటున్న మతిస్థిమితం లేని ఓ యువతి (20)తో వీరి కుటుంబానికి పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు పని మానేసిన శ్రీధర్.. ఈనెల 3 (గురువారం) ఆమెను విజయనగరం సమీపంలో గొట్లాం బైపాస్ వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆమె వద్దని ప్రతిఘటించడంతో ఇద్దరు మధ్య జరిగిన పెనుగులాట జరిగింది. ఆమెకు స్వల్ప గాయాల అయ్యాయి. దీంతో ఆమెతో పాటు ద్విచక్రవాహనాన్ని బైపాస్ రోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. అయితే.. తమ కుమార్తెను శ్రీధర్ తీసుకెళ్లాడని, ఫోన్ చేస్తుంటే స్పందించట్లేదని అదే రోజు భీమిలి పోలీస్ స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. బాధితులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అదేరోజు మతిస్థిమితం లేని అమ్మాయి రహదారి పక్కన చాలా సేపటి నుంచి ఉందని.. గుంకలాం గ్రామస్తులు విజయనగరం రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమ్మాయి వివరాలేవీ చెప్పలేకపోవడంతో.. స్కూటీ నంబరు ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. దీంతో భీమిలి చిరునామా, యువతి తండ్రి ఫోన్ నంబర్ వచ్చాయి. ఆయనకు ఫోన్ చేసి చెప్పగా తండ్రి వచ్చి కుమార్తెను తీసుకెళ్లారు.
అయితే.. యువతి శరీరంపై గాయాలను గుర్తించిన కుటుంబీకులు మళ్లీ భీమిలి పోలీసులను ఆశ్రయించారు. విజయనగరం రూరల్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని.. అక్కడికే వెళ్లి చెప్పాలని బాధితులను పోలీసులు ఇబ్బంది పెట్టినట్లు వాపోయారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో భీమిలి పోలీసులు వారం రోజుల తరువాత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయనగరం పోలీసులకు కేసును బదిలీ చేశారు.
విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ స్పందించి కేసు దర్యాప్తు బాధ్యతను మహిళా పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. సీఐ నర్సింహమూర్తి ప్రత్యేక బృందాలను నియమించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాచిపెంట మండలం పి.కోనవలసలో నిందితుడు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నిందితుడు తమ కుటుంబంతో నమ్మకంగా ఉండేవాడని, ఇలా చేస్తాడని ఊహించలేదని బాధిత తల్లిదండ్రులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)