Annamayya District : యువతి గొంతు కోసి దారుణ హత్య - ఈ ఘటనను చూసిన యువకుడిపై కత్తితో దాడి
Annamayya District Crime News : అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువతి గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనకు చూసిన యువకుడిపై కూడా కత్తితో దాడి జరిగింది.
Annamayya District Crime News : యువతి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. పైగా ఈ హత్య ఘటనను చూసిన యువకుడిపై కూడా కత్తితో దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో చోటు చేసుకుంది.
మండలంలోని దివిటివారిపల్లె గ్రామానికి చెందిన బాలే రమణ కుమారుడు బాలే రామాంజులు అలియాస్ మంజునాథ (27) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తాడు. అలాగే వ్యవసాయ పనులు కూడా చేస్తుంటాడు. ఊరికి సమీపంలోనే మంజునాథ వాళ్ల బోరు బావి ఉంది. వ్యవసాయ బోర్లుకు కరెంటు ఉదయం లేకపోవడంతో రాత్రి భోజనం చేసి… పొలానికి నీరు పెట్టడానికి బోరు బావి వద్దకు వెళ్లాడు.
అదే సమయంలో బోరు బావి పక్కన ఉన్న వారి పూరిపాకలో వెలుగులతో కూడిన శబ్ధం రావడం గమనించాడు. అక్కడికి వెళ్లి చూడగా… అప్పటికే అక్కడ గొంతు కోసి రక్తపు మడుగుల్లో పెళ్లైన యువతి(20) ఉంది. దీన్ని గమనించిన మంజునాథపై కూడా యువతిని హత్య చేసిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడికి దిగారు. కత్తితో విచక్షణారహింతగా దాడి చేశారు.
దుండగులు దాడి చేయడంతో మంజునాథ గొంతుపై తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తస్రావం జరుగుతుంది. అయినా వెంటనే మంజునాథ తన సెల్‌ఫోన్ వదిలి గ్రామంలోకి అరుచుకుంటూ పరిగెత్తాడు. అక్కడ ఊరు జనం అంత గుమిగూడారు. మంజునాథకు మాటలు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మంజునాథ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. దీంతో దివిటివారిపల్లెలో యువతి దారుణంగా హత్యకు గురయిందని విషయం బయటకు పొక్కింది. స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో మదనపల్లి డీఎస్‌పీ జి. ప్రసాద్ రెడ్డి, మదనపల్లి రూరల్ సీఐ సద్గురుడు, నిమ్మనపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
యువతి హత్య జరిగిన ప్రదేశాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. యువతి మెడలో తాళిబొట్టు ఉండడంతో వివాహితగా పోలీసులు గుర్తించారు. అతి భయంకరంగా యువతిని చంపారని పోలీసులు నిర్ధారించారు. అయితే హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలో దుండగులకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి. వాటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందుతులు పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ప్రారంభించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీంలను కూడా రంగంలోకి దింపారు.