AP Capital Amaravati : రాజధానిగా 'అమరావతి' పేరు వెనక రామోజీరావు - ఈ విషయం తెలుసా...?
08 June 2024, 11:53 IST
- Ramoji Rao Suggested Amaravati Name : నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు వెనక ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాడు ముఖ్యమంత్రి పని చేసిన చంద్రబాబే ఓ సందర్భంలో చెప్పారు.
ఏపీ రాజధాని అమరావతి పేరు వెనక రామోజీ రావు
Amaravati Name Suggestion : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఏపీ వేర్వురు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉంటే… నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించారు. ఆ దిశగా నాటి చంద్రబాబు ప్రభుత్వం… కృష్ణా - గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు సిద్ధమైంది. దీనికి అమరావతి అని నామకరణం కూడా చేసింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధామంత్రి హోదాలో నరేంద్రమోదీ కూడా వచ్చారు.
పేరు సూచించింది రామోజీరావే….!
నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. నవ్యాంధ్రకు తొలి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే కొత్త రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ కార్యరూపం దాల్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ పేరు అయితే బాగుంటుందని పలువురి నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరించింది.
రాజధానిగా ఏ పేరు ఉండాలనే దానిపై అనేక మంది సలహాలు, సూచనలు వచ్చినప్పటికీ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేతగా రామోజీ రావు ఇచ్చిన సలహాలనే పరిగణనలోకి తీసుకున్నట్లు చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. ఓ సందర్భంగా అమరావతి అంశంపై మాట్లాడిన చంద్రబాబు…. ఏపీ రాజధానిగా అమరావతి పేరును సూచించిందే రామోజీ రావు అని చెప్పారు. ఇదే పేరును ప్రభుత్వంలోని మంత్రులతో పాటు ఇతరులకు చెప్పానని… అందరూ కూడా ఆమోదం తెలిపారు అన్నారు.
గుండె సంబంధిత సమస్యలతో ఇవాళ ఉదయం రామోజీరావు తుది శ్వాస విడిచారు. ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి చెందిన వేళ… సినీ, రాజకీయ ప్రముఖలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… అమరావతి పేరు వెనక రామోజీరావు ఉన్నారని చంద్రబాబు చెప్పిన వీడియో మళ్లీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.