YS Jagan : చంద్రబాబు కక్షసాధింపులతో పెనుముప్పు..! ఏపీని హింసాయుత రాష్ట్రంగా మార్చారు - వైఎస్ జగన్-ys jagan criticized that constitutional systems have collapsed in the state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan : చంద్రబాబు కక్షసాధింపులతో పెనుముప్పు..! ఏపీని హింసాయుత రాష్ట్రంగా మార్చారు - వైఎస్ జగన్

YS Jagan : చంద్రబాబు కక్షసాధింపులతో పెనుముప్పు..! ఏపీని హింసాయుత రాష్ట్రంగా మార్చారు - వైఎస్ జగన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 08, 2024 05:08 AM IST

YS Jagan On Attacks in AP : ఏపీలో జరుగుతున్న దాడులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు.రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని విమర్శించారు. దాడుల విషయంలో వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

YS Jagan On Attacks in AP :  ఏపీలో ఫలితాల తర్వాత  జరుగుతున్న దాడులు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో వైసీపీ నేతలు…. కూటమి టార్గెట్ చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్… ఇటీవలే కూడా స్పందించారు. మరోవైపు నేతలు గవర్నర్ కు కలిసి ఫిర్యాదు కూడా చేశారు. 

తాజాగా మరోసారి వైఎస్ జగన్ దాడులపై స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందని ట్వీట్ చేశారు.

టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని వైెఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయిందన్న జగన్…. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారన్నారు. 

పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆక్షేపించారు. 

గడిచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోందన్నారు. 

రాష్ట్ర గవర్నర్  జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు పార్టీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

చంద్రబాబు కీలక సూచనలు….

Chandrababu On Attacks : ఏపీలో జరుగుతున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలెర్ట్ గా ఉండాలన్నారు. ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్నికల ఫలితాల తర్వాత…. తమపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. గవర్నర్ తో పాటు పోలీసులు జోక్యం చేసుకోవాలని… రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరుతున్నారు. 

ఇటీవలే ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. అతిపెద్ద భాగస్వామ్యపక్షంగా టీడీపీ ఉంది. ఇక జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందింది. అయితే మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… కేవలం 11 స్థానాలను మాత్రం సాధించింది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఏపీ అసెంబ్లీలో జనసేన రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.