Amareswara swamy temple: అమరావతిలోని శ్రీ అమరేశ్వరస్వామి క్షేత్ర మహిమ, ఆలయ చరిత్రతో పాటు మరెన్నో విశేషాలు-the majesty of sri amareswara swamy kshetra in amaravati the history of the temple and many more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Amareswara Swamy Temple: అమరావతిలోని శ్రీ అమరేశ్వరస్వామి క్షేత్ర మహిమ, ఆలయ చరిత్రతో పాటు మరెన్నో విశేషాలు

Amareswara swamy temple: అమరావతిలోని శ్రీ అమరేశ్వరస్వామి క్షేత్ర మహిమ, ఆలయ చరిత్రతో పాటు మరెన్నో విశేషాలు

HT Telugu Desk HT Telugu
May 26, 2024 11:11 AM IST

Amareswara swamy temple: అమరావతిలో ఉన్న అమరేశ్వర స్వామి ఆలయం మహిమ, ఇది ఎలా ఏర్పడింది. ఇక్కడి విశిష్టత గురించి పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలియజేశారు.

అమరావతి శ్రీ అమరేశ్వరస్వామి క్షేత్రం
అమరావతి శ్రీ అమరేశ్వరస్వామి క్షేత్రం (youtube)

Amareswara swamy temple: దక్షిణ భారతదేశంలో పంచారామ క్షేత్రాలలో అమరావతిలో ఉన్న అమరేశ్వరస్వామి చాలా విశేషమైన క్షేత్రము. దేవలోకములో ఉన్న అమరావతిని పాలించే ఇంద్రుడిచే ప్రతిష్టింపబడిన లింగము వలన ఈ శివలింగానికి (ఈ ఆలయానికి) శ్రీ అమరేశ్వరస్వామిగా, ఈ ప్రాంతానికి అమరావతిగా పేరు వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తారకాసురుడు అను రాక్షసుడు తపస్సు చేసి శివుని మెప్పించి ప్రాణలింగమును పొంది తన కంఠమునందు ధరించి మునులను, దేవతలను బాధింపసాగెను. శివుని ఆజ్ఞచే కుమారస్వామి తారకాసురునితో యుద్దము చేసి వాని కంఠమునందు గల ప్రాణలింగమును ఛేదించగా తారకాసురుడు మరణించెను.

సదరు ప్రాణలింగము కుమారస్వామి బాణము తాకిడికి ఐదు ముక్కలై ఐదు స్థలములలో పడెను. ఈ ఐదు ప్రదేశములే పంచారామములనెడి పేరుతో శివక్షేత్రములుగా ప్రసిద్ధి నొందినవి. పంచారామాలు ఉన్న స్థలములు ఆంధ్రప్రదేశ్ లో ఉండుట విశేషము. దేవేంద్రుడు శివుని ఆజ్ఞతో తెల్లని కాంతితో ఆద్యంతములు తెలుసుకొనుట వీలు లేనట్లు పెరుగుచున్న మహేశ్వర లింగమును క్రౌంచనగిరి పర్వతముపై ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజున ప్రతిష్ట చేసి మారేడు దళములతోను బంగారు పూలతోను పూజ చేసి అమరేశ్వరుడని పేరు పెట్టెను.

శ్రీ అమరేశ్వర దేవస్థానము మూడు ప్రాకారములలో శివుడు, అమ్మవారు, విష్ణువు, వినాయకుడు, సూర్యుడితో కూడి దేవస్థానములో నిర్మించబడి పంచాయతన క్షేత్రముగా ప్రసిద్ధి నాందినది. శ్రీ అమరేశ్వరస్వామి శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారి దేవస్థానములతో పాటు ఈ ప్రాంగణములో 22 ఉపదేవాలయములు కలవు. ప్రాకారములో శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు మొదటి ప్రాకారము పడమర భాగమున శ్రీ జ్వాలాముఖి అమ్మవారు, తూర్పు భాగమున శ్రీమహిషాసుర మర్ధిని అమ్మవారి దేవాలయములు ఉన్నందున త్రిశక్తి క్షేతముగా కూడ ప్రసిద్ధి నొందినది.

శ్రీ అమరేశ్వర లింగము పానుమట్టముపై నుండి 7 అడుగుల ఎత్తుతో ౩ అడుగుల కైవారముతో ఉన్నది. ఈ దేవస్థానమునకు ఉత్తర భాగమున కృష్ణానది ప్రవహించుచున్నది. శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానమునందు కొమ్మనాయకుని శాసనము, కోటకేతరాజుల శాసనములు అనవేమారెడ్డి శ్రీకృష్ణదేవరాయ శాసనము, హంద్రిక పెద్దప్పంగారి శాసనము, శ్రీరాజావాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారి శాసనములు చూడవచ్చును.

చివరగా చింతపల్లి రాజధానిగా చేసికొని జమీందారుగా పరిపాలన సాగించుచున్న శ్రీరాజా వాసి రెడ్డి వేంకటాద్రి నాయుడు ప్రజలకు చెంచుల వలన కలుగుచున్న బాధలను గమనించి వారిని శిక్షించినాడు. పాప పరిహారార్థము కొరకు తన పరగణాలలో ఏక ముహూర్తము 108 శివాలయములు ప్రతిష్ట జరిపించినట్లు తెలియుచున్నది. శ్రీ వేంకటాద్రినాయుడుగారు తన అమాత్యుల సలహా మేరకు 1795లో తన రాజధాని చింతపల్లి నుండి ధాన్యకటకముకు మార్చుకుని పరిపాలన సాగించినారు.

ధాన్యకటకము (ధరణికోట) శతాబ్ధి నాటికే శాతవాహనుల రాజధానిగా ఉన్నట్లు తెలియుచున్నది. 2వ ప్రాకారములో దక్షిణ భాగమున శ్రీకృష్ణదేవరాయలు, శ్రీరాజావాసిరెడ్డి వేంకటాద్రినాయుడు తూగిన తులాభారమండపములు గలవు. శ్రీ వేంకటాద్రి నాయుడు గారు ప్రస్తుతము దేవస్థానము ఉన్న ప్రాంతమును అమరావతిగా నామకరణ చేసెను. వీరా హయాములో ప్రస్తుతమున్న దేవస్థానము పునరుద్ధరణ జరిగి దేవాలయ నిత్య ధూప నైవేద్యాలకు అర్చన, వీరి పాలన నిర్వహణకు వేలాది భూములను స్వామివారికి సమర్పించి వారు ప్రస్తుతము వీరి వంశీకులైన శ్రీ శ్రీరాజావాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్‌గారు దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్తగా పాలకమండలి అధ్యక్షునిగా వ్యవహరించుచున్నారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner