Lord ganesha: ఏ పని మొదలు పెట్టినా, పూజ చేస్తున్నా ముందుగా వినాయకుడికి తొలి పూజ అందిస్తారు. అలా చేయడం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా వినాయకుడు కాపాడతాడని నమ్మకం. అందుకే ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించి ఆ తర్వాత మిగతా దేవుళ్ళని పూజిస్తారు.
మహావిష్ణువు అవతారాలు ఎత్తిన విషయం అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తి మాదిరిగానే వినాయకుడు కూడా అవతారాలు ఎత్తాడు. రాక్షసులని సంహరించడం కోసం ఎనిమిది అవతారాలు ఎత్తినట్టు పురాణాలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పూర్వం చ్యవనుడు అనే రుషి మదాసురుడు అనే రాక్షసుడిని సృష్టించాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు హ్రీం అనే మంత్రాన్ని పఠించడం వల్ల అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి. దీంతో మదాసురుడికి తిరుగులేకుండా పోయింది. అతని పనులకి భయపడిపోయిన దేవతలంతా సనత్కుమారుని వద్దని శరణు వేడుకున్నారు. ఆయన విఘ్నేశ్వరుడిని ప్రార్థించమని చెప్తారు. దీంతో దేవతలందరూ విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. వారి ప్రార్థనలు ఆలకించిన విఘ్నేశ్వరుడు ఏకదంతునిగా అవతరించి మదాసురుడిని జయిస్తాడు.
కుబేరుని ఆస నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. అతడు శివ పంచాక్షరి పారాయణం చేసి శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించే వరాన్ని అందుకుంటాడు. ఆశబోతుగా మారి శివుడి కైలాసాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తాడు. అప్పుడు దేవతలు రైభ్యుడనే రుషి దగ్గరకి వెళతారు. ఆయన విఘ్నేశ్వరుడిని శరణు కోరమని సూచిస్తాడు. అలా సకల దేవతల ప్రార్థనలకి విఘ్నేశ్వరుడు గజాననుడిగా మారి లోభాసురుడిని ఒడిస్తాడు.
ఇంద్రుడు చేసిన తప్పుల వలన మాత్సర్యసురుడు పుడతాడు. అతని రాక్షసత్వానికి అల్లడిపోయిన దేవతలంతా దత్తాత్రేయుని సాయం చేయమని కోరతారు. ఆయన విఘ్నేశ్వరుడిని ప్రార్థించమని చెప్పారు. అప్పుడే విఘ్నేశ్వరుడు వక్రతుండినిగా మారి మాత్సర్యసురుడిని ఓడిస్తాడు. వక్రతుండుడు ఓంకారానికి ప్రతీక.
పరమశివుడు ఒకనాడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. పార్వతి దేవి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకి తీసుకురావాలని గిరిజన యువతిగా మారి తపస్సుకి భంగం కలిగిస్తుంది. ఒక్కసారిగా మెలుకువ వచ్చిన పరమేశ్వరుడి ఏం జరిగింది అనే అయోమయంలో మహిషాసురుడుగా జన్మిస్తాడు. అతడు ముల్లోకాధిపత్యాన్ని సాధిస్తాడు. తన ఆగడాలు ఆపేందుకు విఘ్నేశ్వరుడు మహోదరుడిగా అవతరించి అంతమొందిస్తాడు.
శంబరుడు అనే రాక్షసుని సాయంతో మమతాసురుడు ముల్లోకాలని ఇబ్బందిపెట్టాడు. దీంతో దేవతలందరూ పరమేశ్వరుడిని ప్రార్థించారు. అప్పుడు నాగుపాము వాహనం చేసుకుని విఘ్న రాజు అవతారంలో వచ్చి మమతాసురుడిని మట్టుబెట్టాడు.
పూర్వం కామాసురుడనే రాక్షసుడు తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందుతాడు. ముల్లోకాల మీద ఆధిపత్యం సాగించాడు. రాక్షసుడి బారి నుంచి కాపాడమని దేవతలందరూ విఘ్నేశ్వరుడి వేడుకున్నారు. అప్పుడు వికటుడు అవతారం ఎట్టి రాక్షసుడిని అంతమొందించాడు.
అహంకరాసుడనే రాక్షసుడి పాలనతో విసుగు చెందిన దేవతలు రక్షించమని విఘ్నేశ్వరుడుని వేడుకున్నారు. దుమ్రావర్ణుడు అవతారంలో వచ్చి అహంకరాసురుడిని చంపినట్టు పురాణాలు చెబుతున్నాయి.
క్రోదాసురుడు అనే రాక్షసుడిని మట్టుబెట్టడానికి లంబోదరుడు అవతారం ఎత్తుతాడు. క్రోదం ఎప్పుడు తాను ఇష్టపడిన దాని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమవుతోంది. వినాయకుడిని పూజించడం ద్వారా కోపాన్ని వదిలించుకోవచ్చు.