Narasimha jayanti 2024: నేడే నరసింహ జయంతి.. ఈ పూజ సాయంత్రం వేళ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కథ ఏంటి?-today narasimha jayanti shubha muhurtham puja vidhanam ritulas story and many details in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Narasimha Jayanti 2024: నేడే నరసింహ జయంతి.. ఈ పూజ సాయంత్రం వేళ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కథ ఏంటి?

Narasimha jayanti 2024: నేడే నరసింహ జయంతి.. ఈ పూజ సాయంత్రం వేళ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కథ ఏంటి?

Gunti Soundarya HT Telugu
May 21, 2024 10:38 AM IST

Narasimha jayanti 2024: శ్రీ మహా విష్ణువు నరసింహ అవతారం ఈరోజే ఉద్భవించిందని అంటారు. ఈ పండుగ రోజు సాయంత్రం వేళ పూజ చేయడం నియమం. అలా చేయడం వెనుక ఉన్న కథ ఏంటి? నరసింహ జయంతి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

నరసింహ జయంతి 2024
నరసింహ జయంతి 2024 (pinterest)

Narasimha jayanti 2024: సనాతన ధర్మంలో నరసింహ జయంతిని ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈరోజు శ్రీహరి విష్ణువు నరసింహావతారాన్ని పూజించి ఉపవాసం ఆచరిస్తారు. తన భక్తుడైన ప్రహ్లాదుడుని హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు నుంచి రక్షించడానికి లోకానికి అధిపతి అయిన విష్ణువు నరసింహావతారం ఎత్తాడని చెబుతారు.

నరసింహ చతుర్దశి రోజున ఉపవాసం ఉండి విష్ణువుని ఆరాధించడం వల్ల సకల దుఖాలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే 21 నరసింహ జయంతిని జరుపుకుంటున్నారు. సాధారణంగా ఉదయ తిథి ప్రకారం పూజ చేస్తారు. అయితే నరసింహ జయంతి పూజ మాత్రం సాయంకాలం సంధ్యా సమయంలో ఉంటుంది.

శుభ సమయం

నరసింహ జయంతి మే 21 సాయంత్రం 5:39 గంటలకు ప్రారంభమై మే 22 సాయంత్రం 6. 47 గంటలకు ముగుస్తుంది. సంధ్యా సమయం ప్రకారం మే 21 సాయంత్రం నరసింహ జయంతి పూజ చేస్తారు. ఈరోజు రవి యోగం ఏర్పడుతుంది. అలాగే చిత్తా నక్షత్రం ఉంటుంది. స్వాతి నక్షత్రం కూడా ఏర్పడుతుంది. పూజా సమయం ఈరోజు సాయంత్రం 4. 24 గంటల నుంచి 7. 09 గంటల వరకు ఉంటుంది.

పూజా విధానం

నరసింహ జయంతి సాయంత్రం పూట పూజ నిర్వహిస్తారు. పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజ గదిలో ఒక చిన్న పీట ఏర్పాటు చేసే దానిమీద ఎర్రటి వస్త్రాన్ని పరిచాలి. తర్వాత నరసింహ స్వామి, లక్ష్మీదేవి, విష్ణు మూర్తి విగ్రహాలను ప్రతిష్టించాలి. నరసింహస్వామి ముందు దీపం వెలిగించాలి. పండ్లు, పూలు, పంచామృతం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. హారతి ఇచ్చి ఓం నరసింహాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి.

నరసింహ జయంతి ప్రాముఖ్యత

నియమం ప్రకారం నరసింహ స్వామిని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక పనులు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రతికూల శక్తిల నుంచి విముక్తి కలుగుతుంది. తెలివితేటలు, కీర్తి, బలం పెరుగుతాయి. భక్తుడైన ప్రహ్లాదుడును రక్షించడానికి విష్ణువు నరసింహుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. నరసింహ స్వామి సగం మనిషి శరీరం సగం సింహం ఉంటాయి.

నరసింహ స్వామికి చల్లని వస్తువులు సమర్పించాలి. అలాగే నెమలి ఈకలు దేవుడికి సమర్పించడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది. పెరుగుని నైవేద్యంగా సమర్పిస్తే నరసింహస్వామి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే నరసింహ స్వామికి చందనం పేస్టును సమర్పించడం వల్ల నయం కాని రోగాలు కూడా నయమవుతాయి. ఏకాదశి ఉపవాసం ఆచరించిన మాదిరిగానే నరసింహ జయంతి రోజు ఉపవాసం ఆచరించాలి. అన్ని రకాల ధాన్యాలు వాడటం నిషేధించాలి. ధర్మానుసారం పూజించడం వల్ల భక్తుడి ప్రతి కోరిక నెరవేరుతుంది బాధలన్నీ సమసిపోతాయి.

నరసింహ అవతార కథ

హిరణ్యకశిపుడు చావు అనేది లేకుండా వరం పొందాడు. పురుషులు, స్త్రీల వల్ల మరణం సంభవించదు. ఇంట్లోనూ, బయట, నేల మీద, ఆకాశంలోనూ అతన్ని చంపలేరు. పగలు రాత్రి వేళలో ఆయుధాలతో కూడా హిరణ్యకశిపుడిని చంపలేరు. అటువంటి అద్భుతమైన వరాన్ని పొందాడు. ఈ వరం కారణంగా అతడు తనని తాను దేవుడిగా భావించడం ప్రారంభించాడు. ముల్లోకాలను అణగదొక్కడం మొదలుపెట్టాడు. తనని తప్ప మరి ఏ దేవుడిని ప్రార్థించకూడదని దేవతలు అందరిని ఆదేశించాడు. హిరణ్యకశిపుడి బాధలు భరించలేక దేవతలందరూ విష్ణువుని శరణు వేడారు.

హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి విష్ణు భక్తుడు. దాని గురించి తెలుసుకున్న హిరణ్యకశిపుడు కుమారుడిని విష్ణు భక్తి మానుకోమని చెప్పాడు. కానీ అందుకు నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు కుమారుడిని పలు మార్లు చిత్రహింసలకు గురి చేశాడు. ఒకరోజు రాజసభకు పిలిపించి విష్ణు భక్తిని విడిచిపెట్టమని గర్జించాడు. కానీ అందుకు ప్రహ్లాదుడు నిరాకరించాడు.

హిరణ్యకశిపుడు అప్పుడు కోపంతో మీ దేవుడు అన్ని చోట్ల ఉంటే ఈ స్తంభంలో ఎందుకు ఉండడు అంటూ స్తంభాన్ని బలంగా కొట్టాడు. అప్పుడు స్తంభం నుంచి నరసింహుడు ఉద్భవించాడు. శరీరంలో సగం మనిషి, సగం సింహం ఉంటుంది. నరసింహుడు హిరణ్యకశిపుడిని పట్టుకొని ఇంటి గుమ్మం వద్దకు తీసుకెళ్లి కాళ్లపై పడుకోబెట్టి పదునైన తన గోళ్ళతో చీల్చి చంపాడు.

హిరణ్యకశిపుడిని చంపే సమయానికి పగలు, రాత్రి కాదు సూర్యాస్తమయం అయింది. అతను ఇంటి లోపల, బయట కాకుండా భూమి మీద కాకుండా ఇంటి గుమ్మం మీడ చనిపోయాడు. నరసింహుడు ఆయుధాలతో కాకుండా గోళ్ళతో సంహరించాడు. అందుకే సూర్యాస్తమయ సమయంలోనే నరసింహుడి అవతారం ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో నరసింహస్వామిని పూజిస్తారు.

WhatsApp channel