PIL On Pushpa 2 : విడుదలకు ముందు పుష్ప 2 కు మరో షాక్, టికెట్ల రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్
04 December 2024, 15:13 IST
PIL On Pushpa 2 : పుష్ప 2 టికెట్ల రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ల రేట్లు భారీగా పెంచారని, ఇది చట్ట విరుద్ధమని పిల్ దాఖలైంది. టికెట్ల రేట్ల పెంపుపై కోర్టు కల్పించుకోవాలని కోరారు.
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీజర్ విడుదల
పుష్ప 2 విడుదలకు ముందు అడ్డంకులు తప్పడంలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'పుష్ప 2 ది రూల్' డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా టికెట్ల రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోలకు రూ.800, 5వ తేదీన సింగిల్ స్క్రీన్‌లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200.. జీఎస్టీ ఛార్జీలతో కలిపి పెంచారు. డిసెంబరు 17 వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయి. అయితే టికెట్ల రేట్లు భారీగా పెంచారని నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సినిమా టికెట్ల ధరల పెంపుపై కోర్టు కల్పించుకోవాలని కోరారు. సామాన్యుడికి అందుబాటులోకి టికెట్ల రేట్లు తీసుకురావాలని పిటిషనర్ తన ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ హైకోర్టులో ఇలా
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. పుష్ప 2 నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తీశారని, విడుదల ఆపాలని శ్రీశైలం అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూశాకే విడుదలకు అనుమతి ఇచ్చారని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఊహాజనితంగా నిర్మించిన సినిమాను అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్లతో తమ విలువైన సమయాన్ని వృథా చేసినందుకు కోర్టు సీరియస్ అయ్యింది. పిటిషనర్ కు జరిమానా విధించిన కోర్టు... దానిని ఓ స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని ఆదేశించింది.
పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై టీజీ హైకోర్టులో పిటిషన్
పుష్ప2 సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. టికెట్ల రేట్లు భారీగా పెంచారని తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. బెనిఫిట్ షోల పేరుతో ఒక్కో టికెట్‌కు అదనంగా రూ.800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మొదటి 15 రోజులు టికెట్ ధరలు అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. భారీ బడ్జెట్‌తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని మైత్రీ మూవీ మేకర్స్ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వమే టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇచ్చిందన్నారు.
భారీగా టికెట్ రేట్ల పెంపుపై అభిమానులపై భారం పడుతోందని, బెనిఫిట్ షోలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినింపించారు. బెనిఫిట్ షోకు ఒక వ్యక్తి 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే రూ. 8 వేలు అవుతుంది కదా అని జడ్జి అడిగారు. అయితే బెనిఫిట్ షోలు కేవలం హీరో ఫ్యాన్స్ కు మాత్రమేనని, అందుకే రేట్లు ఎక్కువగా పెంచినట్లు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు నిర్మాత తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో ఈ పిటిషన్ పై తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి వాయిదా వేశారు.