తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Punganur Incident : అప్పు తీర్చమన్నందుకు ఇంతటి దారుణం, పుంగనూరు బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

Punganur Incident : అప్పు తీర్చమన్నందుకు ఇంతటి దారుణం, పుంగనూరు బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

06 October 2024, 16:35 IST

google News
    • Punganur Incident : పుంగనూరు బాలిక హత్య కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. బాలిక తండ్రి ఇచ్చిన అప్పు తీర్చమన్నందుకు ఓ మహిళ, తన తల్లితో కలిసి ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు ప్రకటించారు. బాలికకు అన్నం పెట్టి, ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు తెలిపారు.
అప్పు తీర్చమన్నందుకు ఇంతటి దారుణం, పుంగనూరు బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
అప్పు తీర్చమన్నందుకు ఇంతటి దారుణం, పుంగనూరు బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

అప్పు తీర్చమన్నందుకు ఇంతటి దారుణం, పుంగనూరు బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఏపీలో సంచలనమైన పుంగనూరు బాలిక హత్య కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. అప్పు తీర్చమన్నందుకు, కోపంతో ఆరేళ్ల బాలికను హత్య చేసినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. చిన్నారి అస్పియా తండ్రి ఓ మహిళకు రూ.3.60 లక్షలు అప్పు ఇచ్చాడు. ఆమె డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో..దూషించాడు. ఆ కోపంతో సదరు మహిళ, తన తల్లితో కలిసి అస్పియాను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. మూడ్రోజుల క్రితం ట్యూషన్ కు వెళ్లి తిరిగి వస్తున్న అస్పియాను...ఆ మహిళ తన తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ బాలికకు భోజనం పెట్టి... ఆ తర్వాత ఇద్దరూ కలిసి బాలికను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం బాలిక డెడ్ బాడీని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ లో పడేశారు. బాలిక ఆచూకీ కనిపించడంలేదని ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు...మూడు రోజుల్లో కేసును ఛేదించారు.

"మా పాప కనిపించటం లేదని ఫిర్యాదు చేయగానే, పోలీసులు వెంటనే స్పందించి, మూడు రోజుల పాటు నిద్ర కూడా లేకుండా దర్యాప్తు చేశారు. పుంగనూరు ప్రజలు కూడా మాకు అండగా ఉన్నారు. కానీ, మా పాప మాకు దక్కలేదు. సీఎంపై మాకు నమ్మకం ఉంది, మా పాపని చంపిన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా"- బాలిక తండ్రి

బాలికపై అత్యాచారం జరగలేదు - హోంమంత్రి అనిత

పుంగనూరులో ఆరేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటన చేశారు. బాలిక మిస్సింగ్ ఫిర్యాదు అందగానే ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు హోంమంత్రి తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం చాలా బాధాకరమని ఆవేదన చెందారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. బాలిక హత్య కేసును వైసీపీ రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో వందల మందిపై అత్యాచారాలు జరిగినా... ఏ రోజు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదని విమర్శించారు. బాలికపై అత్యాచారం జరగలేదని, ఆమె ఒంటిపై చిన్న గాయం కూడా లేదని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందన్నారు. అస్పియా కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారని హోంమంత్రి తెలిపారు.

ఫోన్ లో సీఎం పరామర్శ

పుంగనూరులో చనిపోయిన చిన్నారి కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. చిన్నారి తండ్రిని ఫోన్ లో పరామర్శించారు. అజ్మతుల్లా నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

ఆరేళ్ల బాలిక మృతి అత్యంత బాధాకరమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితులకు భరోసా ఇవ్వడానికి మేమందరం వచ్చామన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చేస్తామని మంత్రి తెలిపారు. చిన్నారి హత్యను వైసీపీ నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

తదుపరి వ్యాసం