Guntur Crime : పోలీసునంటూ బెదిరించి బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం
06 October 2024, 11:56 IST
- గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పోలీస్ పేరుతో ఓ దుండగుడు బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం representative image
గుంటూరు జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. బీ ఫార్మసీ విద్యార్థినిపై ఒక దుండగుడు పోలీసునంటూ బెదిరించి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ అత్యాచార ఘటన గుంటూరు నగరంలోని బుచ్చయ్యతోటవైపు ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో జరిగింది. ఎన్‌టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ విద్యార్థిని గుంటూరు నగరంలోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ సమీపంలోని ఓ కాలేజీలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతోంది.
ఆమెకు సోషల్ మీడియాలోని ఇన్‌స్ట్రాగ్రాంలో పాత గుంటూరుకు చెందిన బార్బర్ షాప్‌లో పని చేసే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. క్రమేణా వారి మధ్య సాహన్నిహత్యం పెరగడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారిద్దరూ కలిసి తిరిగేవారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసే ఉంటున్నారు.
కొద్ది రోజుల నుంచి గుంటూరు నగరంలో నెహ్రూనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీ (శుక్రవారం) తెల్లవారు జామున 3ః30 గంటల సమయంలో వారిద్దరూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీ తాగడానికి వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తున్నారు.
ఆ సమయంలో కొత్తపేట బోసుబొమ్మ కూడలి వద్ద ఓ వ్యక్తి వారిని ఆపాడు. వెంటనే వారు ద్విచక్ర వాహనం ఆపి… ఎందుకు ఆపుతున్నారని అడిగారు. అందుకు ఆ వ్యక్తి తాను పోలీసునని చెప్పాడు. వెంటనే వీరు కాస్తా కంగారు పడ్డారు. దీన్ని అదునుగా తీసుకున్న సదరు వ్యక్తి.. ఈ సమయంలో ఇద్దరు ఎక్కడ నుంచి వస్తున్నారని అడిగాడు. వెంటనే వారు మొత్తం చెప్పారు. తాము టీ తాగడానికి వచ్చామని, తాగి తిరిగి వెళ్తున్నామని చెప్పారు. వివరాలు తెలుసుకున్న దుండగుడు అర్ధరాత్రుళ్లు ఇలా తిరగకూడదని వారితో అన్నాడు. మీరు చెప్పిన వివరాలు నిజామా? కాదా? అని విచారించి నిర్దారించుకుంటానని చెప్పాడు.
వాళ్లు ఉంటున్న ఇల్లు చూపించమని, ఆ యువతిని అక్కడే తాను దించుతానని చెప్పి ఆ దుండగుడు తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్నాడు. నువ్వు తమ వెనకే రావాలని ఆ యువకుడికి చెప్పాడు. అందుకు అంగీకరించిన యువకుడు, వారిని వెంబడించాడు.
కొద్ది దూరం వెళ్లిన తరువాత… సరిగ్గా అదే సమయంలో ఆ యువకుడి ద్విచక్ర వాహనం పెట్రోలు అయిపోవడంతో ఆగిపోయింది. తమ వెనుక వచ్చే యువకుడి ద్విచక్ర వాహనం ఆగిపోవడాన్ని గ్రహించిన దుండగుడు… యువతిని బుచ్చయ్యతోటవైపు తీసుకెళ్లాడు. ఆ యువతి ఎందుకు అటువైపు తీసుకెళ్తున్నావని ప్రశ్నించినా, వేగంగా అటువైపు నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ యువతిపై అత్యాచారం చేశాడు.
అనంతరం ఆమెను బెదిరించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వారిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో యువతికి గాయాలు అయ్యాయి. దీంతో శనివారం యువతి స్థానిక కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ దుండగుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ వీరయ్య మాట్లాడుతూ తమకు ఫిర్యాదు అందిందని, తాము నిందితుడిని పట్టుకునేందు చర్యలు చేపట్టామని తెలిపారు. కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.