Sangareddy News : ఐదేళ్ల బాలిక హత్య కేసు- దంపతులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష-sangareddy minor girl torcher to detach head constable couple life imprisonment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy News : ఐదేళ్ల బాలిక హత్య కేసు- దంపతులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష

Sangareddy News : ఐదేళ్ల బాలిక హత్య కేసు- దంపతులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష

HT Telugu Desk HT Telugu
Oct 01, 2024 10:24 PM IST

Sangareddy News : ఐదేళ్ల బాలికను పనిలో పెట్టుకుని వేధించి హత్య చేసిన హెడ్ కానిస్టేబుల్, అతని భార్యకు ఫ్యామిలీ కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. 2015 లో జరిగిన ఈ ఘటనపై సుదీర్ఘ వాదనలు అనంతరం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ఐదేళ్ల బాలిక హత్య కేసు- దంపతులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష
ఐదేళ్ల బాలిక హత్య కేసు- దంపతులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష

Sangareddy News : 5 సంవత్సరాల బాలికను పనిలో పెట్టుకోవడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి ఆమె మరణానికి కారణమైన దంపతులకు ఫ్యామిలీ కోర్ట్ నాల్గో సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి కోట్ల లావణ్య బాల్ రెడ్డి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తా లోని గాంధీనగర్ లో సయ్యద్ జాకీర్ అహ్మద్, ఆయన భార్య రజియా సుల్తానా నివాసం ఉండేవారు. గతంలో ఐడీఐ బొల్లారంలో జాకీర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించేవాడు.

పనిలో పెట్టుకొని చిత్రహింసలకు గురిచేయడంతో

ఈ క్రమంలో 2015 జనవరిలో కర్ణాటక నుంచి ఓ ఐదు సంవత్సరాల బాలికను తీసుకొచ్చి వీరింట్లో పనికి పెట్టుకున్నారు. ఆ బాలిక ఇంట్లో పనులు సరిగ్గా చేయడం లేదని, శారీరకంగా.. మానసికంగా హింసిస్తూ కాల్చి వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. నిత్యం చిత్రహింసలకు గురి చేస్తూ హింసించడంతో పాటు ఆమెను కొట్టడం ద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

మైనర్ ను పనిలో పెట్టుకోవడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి ఆమె మరణానికి కారణమైన నిందితులపై చైల్డ్ హెల్ప్ లైన్ అధికారి చంద్ర కొండాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీఐ నాగరాజు విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు నాల్గో సెషన్స్ సంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి కోట్ల లావణ్య బాల్ రెడ్డి నిందితులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు, రూ. 2000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ రూపేష్ అభినందించారు.

మెదక్ లో రోడ్డు ప్రమాదం

అతివేగంగా ద్విచక్ర వాహనంపై వస్తూ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా ఏమునుర్ కు చెందిన కట్ల రమేష్ (35) వెల్దుర్తి మండలంలోని మానెపల్లిలో నివసిస్తూ మేస్త్రిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం పక్క గ్రామం అయిన అందుగులపల్లికి పన్ని నిమిత్తం వెళ్ళాడు. పని ముగించుకొని సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో అందుగులపల్లికి శివారులోకి రాగానే వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Whats_app_banner

సంబంధిత కథనం