Sangareddy Accident: సంగారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం.. పని ఉందని వచ్చి , శాశ్వతంగా వెళ్లిపోయారు..-there was a serious road accident in sangareddy he came to work and left forever ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Accident: సంగారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం.. పని ఉందని వచ్చి , శాశ్వతంగా వెళ్లిపోయారు..

Sangareddy Accident: సంగారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం.. పని ఉందని వచ్చి , శాశ్వతంగా వెళ్లిపోయారు..

HT Telugu Desk HT Telugu
Sep 18, 2024 02:01 PM IST

Sangareddy Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో పని ఉందని చెప్పి ముగ్గురు యువకులు కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అనంతరం ఆ పనిని ముగించుకొని ఇంటికి తిరుగు పయనమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా మృత్యువు రూపంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

సంగారెడ్డి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
సంగారెడ్డి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి (HT)

Sangareddy Accident:సంగారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వెనుక నుంచి లారీ డీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ఒకేరోజు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి

అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ....

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన వెంకటేష్ (34) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా వెంకటేష్ కు ఇస్నాపూర్ లో పని ఉండటంతో, అదే గ్రామానికి చెందిన రమేష్ (35), మల్లేష్ ని తీసుకొని ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

అనంతరం ఇస్నాపూర్ లో పని ముగించుకొని ముగ్గురు కలిసి ఇంటికి తిరుగు పయనమయ్యారు. వీరు వెళ్తున్న వాహనం మార్గమధ్యలో జాతీయ రహదారి దాటుతుండగా పటాన్చెరు నుండి సంగారెడ్డి వైపు వేగంగా వెళ్తున్న లారీ వెనక నుండి బైక్ ను బలంగా ఢీకొట్టింది.

దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు కిందపడగా, తీవ్ర గాయాలైన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన రమేష్, మల్లేష్ ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు. కాగా మల్లేష్ చికిత్స పొందుతున్నాడు.

పని ఉందని చెప్పి వెళ్లిన కొడుకులు విగత జీవిగా తిరిగి రావడంతో ఆ కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిపోయాయి. ఈ విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పటాన్చెరు పోలీసులు తెలిపారు.

సంగారెడ్డిలో మరో ఘటన …

బైక్ ఫై వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని బీబీపేట్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం బీబీపేట్ గ్రామానికి చెందిన మంగలి బాలరాజు (38) ద్విచక్ర వాహనంపై మంగళవారం బీబీపేట్ నుండి ఖానాపూర్ వైపు బయలుదేరాడు.

మార్గమధ్యలో బీరప్ప గుడి వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో బాలరాజు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శివలీల ఇచిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner