తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Laddu Row : కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా.. ప్రకాష్ రాజ్ మళ్లీ ఏసేశాడు!

Tirumala Laddu Row : కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా.. ప్రకాష్ రాజ్ మళ్లీ ఏసేశాడు!

01 October 2024, 16:25 IST

google News
    • Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారం.. ఏపీ నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రకాష్ రాజ్ హాట్ టాపిక్‌గా మారారు. ఈ ఇష్యూపై పవన్ తొలిసారి మాట్లాడినప్పుటి నుంచి ఇప్పటి వరకూ వరుసగా రోజుకో ట్వీట్ వదిలారు. అవి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినట్టు ఉన్నాయనే టాక్ ఉంది.
ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ (Prakash Raj Facebook Official )

ప్రకాష్ రాజ్

ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ మరో ట్వీట్ వదిలారు. 'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ..కదా..' జస్ట్ ఆస్కింగ్ అంటూ తాజా ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడే కాదు.. గత వారం రోజులుగా ప్రకాష్ రాజ్ రోజుకో ట్వీట్ చేశారు. అయితే.. ఆయన చేసిన ట్వీట్లన్నీ.. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేస్తున్నట్టు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

వరుస ట్వీట్లు..

సెప్టెంబర్ 25 నుంచి ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ వ్యవహారం తెరపైకి వచ్చాక.. పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించినప్పుటి నుంచి.. ఇవాళ్టి వరకు ట్వీట్లు వదులుతూనే ఉన్నారు. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి'.. 'ఇక చాలు..ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి' జస్ట్ ఆస్కింగ్‌ అంటూ ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్లు చేశారు.

జస్ట్ ఆస్కింగ్ అంటూ..

'మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి .. తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. ‌పరిపాలనా సంబంధమైన..‌ అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్' అంటూ సెప్టెంబర్ 27వ తేదీన ట్వీట్ చేశారు.

ఆ ఆనందమేంటో..

'గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌?' అంటూ సెప్టెంబర్ 26వ తేదీన ట్వీట్ చేశారు. 'చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్' అంటూ సెప్టెంబర్ 25న ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

టార్గెట్ పవన్..

అంతకు ముందు డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ పేరు చెప్పి వీడియో విడుదల చేశారు. 'నేను చెప్పింది ఏంటి.. మీరు అర్థం చేసుకుందేంటీ. మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. త్వరలోనే ఇండియాకు వస్తాను. ఆ తర్వాత ప్రతి మాటకు సమాధానం చెప్తా. ఆలోపు వీలైతే నా ట్వీట్ ని మళ్లీ ఒకసారి చదివి అర్థం చేసుకోండి' అని ప్రకాష్ రాజ్ పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను శుభ్రం చేసిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించారు. దీంతో పవన్‌కు కౌంటర్‌గా ప్రకాష్ రాజ్ వీడియో విడుదల చేశారు. ప్రకాష్ రాజ్‌పై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ కేవలం ఈ ఇష్యూపైనే కాదు.. చాలా అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. పాలకులను ప్రశ్నిస్తారు.

తదుపరి వ్యాసం