Kadapa : కడప జిల్లాలో ఘోరం.. ఎనిమిదేళ్ల బాలికపై పినతండ్రి అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు
04 October 2024, 9:41 IST
- Kadapa : కడప జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై పినతండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. భార్య వచ్చేసరికి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఎనిమిదేళ్ల బాలికపై పినతండ్రి అత్యాచారం
తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తే.. బాలికపై అత్యాచారం చేసిన అమానవీయ ఘటనతో కడప నివ్వెరపోయింది. ఈ ఘటన గురువారం కడప నగరం చిన్నచౌకు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిన్నచౌకు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. ఆమె భర్త చనిపోవడంతో.. మళ్లీ ఓ యువకుడు రవిశంకర్ (27)ని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరికీ పది రోజుల కిందట పాప పుట్టింది.
మొదట భర్తకు పుట్టిన ఈ ముగ్గురు పిల్లలకు ఇతను పినతండ్రి అవుతాడు. ఈ ముగ్గురిలో ఎనిమిదేళ్ల బాలికపై పినతండ్రి కన్నేశాడు. గురువారం తల్లి ఇంట్లో ఎనిమిదేళ్ల కుమార్తెను ఉంచి ఆసుపత్రికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక ఒంటరిగా ఉంది. ఈ సమయంలో పినతండ్రి ఆ బాలికపై అత్యాచారాని పాల్పడ్డాడు. బాలిక వద్దని ఎంత వారించినా పట్టించుకోలేదు. ఆమెను కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయానికి భార్య రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే భార్య చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
భార్యను నరికి చంపిన భర్త..
కర్నూలు జిల్లాలో అనుమానంతో భార్యను భర్త హతమార్చాడు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుండాల్సిన భర్తే అనుమానంతో భార్యను అంతమొందించాడు. గ్రామానికి చెందిన పార్వతమ్మ (32)కు అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడుకు చెందిన రామ్మోహన్‌తో పదహారేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మొదట్లో వీరి సంసారం సాఫీగా సాగింది. తరువాత భార్యపై రామ్మోహన్ అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో కోన అప్పలపాడు నుంచి వచ్చి ఏడేళ్లుగా కనకాద్రిపల్లెలోనే ఉంటున్నారు. అయినప్పటికీ భార్యపై రామ్మోహన్ అనుమానం తగ్గలేదు. బుధవారం రాత్రి ఇద్దరు పిల్లలు, అవ్వాతాతల వద్ద నిద్రించగా.. ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో తలపై నరికి హతమార్చాడు. గొడ్డలిపోటు బలంగా పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
గొడ్డలిని అక్కడే పడేసి పరారయ్యాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి పార్వతమ్మ మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. పిల్లలు, కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ రోదించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సీఐ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను అడిగి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి గురించి గాలింపు చర్యలు చేపట్టారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)