Kurnool Accident: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు మృతి
Kurnool Accident: వారంతా వ్యవసాయ కూలీలు. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్తుంటారు. రోజూలాగే పనులకు వెళ్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్టకూటి కోసం వ్యవసాయ పనులు చేసుకోవడానికి వెళ్లిన మహిళ కార్మికులకు విషాదమే మిగిలింది. వారు ప్రయాణిస్తున్న ఆటోను డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన కర్నూలు జిల్లా కర్నూలు మండలం పంచలింగాల గ్రామం సమీపంలోని ఉత్తరా ఫీడ్స్ కంపెనీ వద్ద జరిగింది.
ఈతాండ్రపాడు గ్రామానికి చెందిన 12 మంది మహిళా కూలీలు.. రోజూ మాదిరిగానే వ్యవసాయ పనుల కోసం ఆటోలో తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బూడిదపాడుకు బయలుదేరారు. పంచలింగాల గ్రామాన్ని దాటి టోల్‌గేట్ సమీపంలోని ఉత్తరా ఫీడ్స్ కంపెనీ వద్దకు చేరుకోగానే.. వెనుక వైపు నుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఆటోను బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బెస్త లక్ష్మీదేవి (50) అక్కడికక్కడే మృతి చెందింది.
ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయాల పాలైన సుజాత (28) చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆటో డ్రైవర్ కురువ నరసింహులు తీవ్రంగా గాయపడ్డారు. మరో మహిళ ప్రియాంక కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. పావని, లక్ష్మీదేవి, సరిత, నందు, గంగమ్మ, పార్వతమ్మ, లక్ష్మిదేవి, మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు.
మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బగ్గుల దస్తగిరి పరామర్శించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. మృతలు, గాయపడిన వారి కుటుంబాలను సీపీఎం కర్నూలు జిల్లా నేత పీఎస్ రాధాకృష్ణ, జిల్లా నాయకులు ఎం.రాజశేఖర్, టీ.రాముడు, బాలపీర, మండల నాయకులు హుస్సేనయ్య పరామర్శించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్, తెలుగు )