Nellore Honor killing : నెల్లూరు జిల్లాలో పరువు హత్య.. కుమార్తెను కడతేర్చి.. పూడ్చిపెట్టిన తల్లిదండ్రులు
21 September 2024, 9:14 IST
- Nellore Honor killing : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తాము చెప్పిన మాట వినకుండా, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కుమార్తెను చంపేశారు తల్లిదండ్రులు. ఇంటి సమీపంలోనే ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఏమీ తెలియనట్లు తమ బిడ్డ కనిపించడం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లాలో పరువు హత్య
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభుని సత్రం పల్లిపాళెంలో దారుణం జరిగింది. పల్లిపాళేనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు కుమారుడు సాయి, ఇద్దరు కుమార్తెలు భువనేశ్వరి, శ్రావణి ఉన్నారు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి పదేళ్ల కిందట వివాహమైంది. రెండో కుమార్తె శ్రావణి (24)కి ఆరేళ్ల కిందట పెళ్లి చేశారు. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో.. విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటుంది.
వెంకటరమణయ్య కుటుంబానికి గ్రామంలో మెయిన్ రోడ్డు వెంబడి కూరగాయల దుకాణం ఉంది. తల్లిదండ్రులకు సహాయంగా శ్రావణి ఉంటోంది. ఈ క్రమంలో అల్లూరు మండలం నార్త్‌ఆములూరుకు చెందిన షేక్ రబ్బానీ బాషా అనే పెయింటర్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పది రోజుల కిందట ఇద్దరు కసుమూరు దర్గాలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ నార్త్ఆములూరులోనే కాపురం పెట్టారు.
వారంతో రోజుల తరువాత విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నార్త్ ఆములూరుకు వెళ్లి, కుమార్తెను కొట్టి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. తమ కులానికే చెందిన మరో వ్యక్తితో వివాహం చేస్తామని, వెళ్లొద్దని శ్రావణిపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శ్రావణిని తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు కొట్టి హత్య చేశారు.
ఈ విషయం బయటకు పొక్కకుండా.. ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చెంచయ్య అనే వ్యక్తి సాయంతో గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా పైన కంప పెట్టారు. మళ్లీ ఏమీ తెలియనట్లు తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అయితే.. ఎన్ని రోజులైన శ్రావణి నుంచి ఫోన్ రాకపోవడంతో షేక్ రబ్బానీ బాషా గ్రామంలో ఆరా తీశాడు. తల్లిదండ్రులతో శ్రావణి లేదని గ్రామస్తులు చెప్పగా.. వారే హతమార్చి ఉంటారని అనుమానించాడు. గ్రామస్తులకూ సందేహం వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించగా.. ఖాళీ స్థలంలో పాతిపెట్టిన ఆనవాళ్లు కనిపించాయి.
గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేశాడు. వెంకటరమణయ్య నివసిస్తున్న ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో మహిళ మృతదేహాన్ని పూడ్చి పెట్టారని పోలీసులకు చెప్పారు. ఎస్ఐ కోటి రెడ్డి, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్థులను ఆరా తీశారు. శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది.
పోలీసులు, రెవెన్యూ, ఫోరెన్సిక్ అధికారుల పర్యవేక్షణలో శుక్రవారం అనుమానాస్పద ప్రదేశంలో తవ్వగా.. శ్రావణి మృతదేహం బయటపడింది. మృతదేహం నుంచి నమూనాలు తీసుకున్నారు. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేంద్రబాబు చెప్పారు. శ్రావణి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తామే శ్రావణిని హత్య చేసి పాతిపెట్టామని వారు అంగీకరించారు.
తహసీల్దార్ కె.స్ఫూర్తి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. హత్యకు పాల్పడిన శ్రావణి తల్లిదండ్రులు తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ, సోదరి భువనేశ్వరి, సోదరుడు సాయి, వారికి సహకరించిన చెంచయ్యపై హత్య కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులను, చెంచయ్యను అదుపులోకి తీసుకున్నామని, భువనేశ్వరి, సాయి పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకుంటామని సీఐ సురేంద్రబాబు వివరించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)