Chittoor Murder: చిత్తూరు జిల్లాలో దారుణం.. ఇంటి స్థలం కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న
Chittoor Murder: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి స్థలం కోసం రక్తం పంచుకుపుట్టిన సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం పట్టిగానిపల్లె గ్రామంలో శనివారం రాత్రి దారుణం జరిగింది. పట్టిగానిపల్లె గ్రామంలో వెంకటరమణ, ఆయన తమ్ముడు చెంగయ్య (57) నివాసం ఉంటున్నారు. చెంగయ్య ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలం విషయమై కొంత కాలంగా వీరిద్దరి మధ్య వివాదం జరుగుతుంది. అది తనకే చెందుతుందని అన్న వెంకటరమణ అంటున్నాడు. తమ్ముడు చెంగయ్య కూడా ఆ స్థలం తనకే చెందుతుందని వాదిస్తున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది.
శనివారం రాత్రి అన్న వెంకటరమణ మళ్లీ ఆ స్థలం వద్దకు వచ్చి.. వాగ్వాదానికి దిగాడు. తమ్ముడు చెంగయ్య కూడా గట్టిగా స్పందించాడు. ఈ క్రమంలో ఇద్దరికి ఘర్షణ జరిగింది. ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. కోపోద్రిక్తుడైన అన్న వెంకటరమణ కత్తితో దాడి చేశాడు. దీంతో తమ్ముడు చెంగయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. వివరాలు సేకరించారు.
మృతుడు చెంగయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకుని.. విచారణ జరుపుతున్నారు. వెంకటరమణను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
( రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )