తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Anganwadi Jobs 2024 : అల్లూరి జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పూర్తి వివరాలు ఇవే

AP Anganwadi Jobs 2024 : అల్లూరి జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పూర్తి వివరాలు ఇవే

HT Telugu Desk HT Telugu

20 December 2024, 12:03 IST

google News
    • AP Anganwadi Jobs 2024 : అల్లూరి జిల్లాలో 100 అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు డిసెంబ‌ర్ 31 ఆఖ‌రు తేదీ. ఆ త‌రువాత ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హిస్తారు. ఈ పోస్టులను ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో భ‌ర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి.. ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌
అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

అల్లూరి సీతారామ‌రాజు జిల్లా పాడేరు, రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్ల‌లో పీఎం జ‌న్‌మ‌న్ ప‌థ‌కంలో భాగంగా.. కొత్త‌గా 100 అంగన్ వాడీ కేంద్రాలు మంజూరయ్యాయి. వీటిల్లో పోస్టులను భ‌ర్తీ చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ దినేష్ కుమార్ తెలిపారు. పాడేరు రెవెన్యూ డివిజ‌న్‌లో 11 మండ‌లాలు, రంచోడ‌వ‌రం డివిజ‌న్‌లో 11 మండ‌లాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మ‌హిళలు మాత్ర‌మే అర్హులు. ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్ర‌దేశంలోనే ఉద్యోగం చేయొచ్చు. డిసెంబ‌ర్ 31 తేదీలోపు సంబంధిత సీడీపీవో కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హ‌త..

అంగ‌న్‌వాడీ హెల్ప‌ర్ల పోస్టుల‌కు ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేయ‌డం త‌ప్ప‌ని స‌రి. 2024 జులై 1 నాటికి క‌నీస వ‌య‌స్సు 21 నుంచి 35 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌ ఉండాలి. ఆయా పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు క‌లిగిన అభ్య‌ర్థి లేక‌పోతే.. 18 సంవ‌త్స‌రాలు నిండిన వారి అప్లికేష‌న్ కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

జీతం..

అంగ‌న్‌వాడీ హెల్ప‌ర్ల‌కు రూ.7,000 నెల జీతం ఉంటుంది. ఇంట‌ర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి ప‌రీక్ష లేదు. ఎటువంటి అప్లికేష‌న్ ఫీజు లేదు. అభ్య‌ర్థి స్వ‌యంగా వెళ్లి సంబంధిత సీడీపీవో కార్యాల‌యంలో త‌మ అప్లికేష‌న్ అంద‌జేయాలి. లేక‌పోతే పోస్టు ద్వారా అయినా అప్లికేష‌న్ దాఖ‌లు చేయొచ్చు. బ‌యోడేటాతో పాటు అన్ని విద్యార్హ‌త, ఇత‌ర స‌ర్టిఫికేట్లు జరాక్స్ కాపీల‌పై గెజిటెడ్ ఆఫీస‌ర్‌తో అటెస్టేష‌న్ చేయించి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల‌యంలో అప్లికేష‌న్ అంద‌జేయాలి.

పూర్తి వివ‌రాలు కావాల‌నుకునే అభ్య‌ర్థులు శిశు సంక్షేమ కార్యాల‌యాల్లో సంప్ర‌దించాలి. అందులో రిజ‌ర్వేష‌న్‌, అర్హ‌త‌ల వంటి అన్ని వివ‌రాలు ఉంటాయ‌ని క‌లెక్ట‌ర్ దినేష్ కుమార్ తెలిపారు. అప్లికేష‌న్ డిసెంబ‌ర్ 20 తేదీ నుంచి దాఖ‌లు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తును పూర్తి చేసి, దానికి సంబంధిత ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జ‌త చేసి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అప్లికేష‌న్‌ను డిసెంబ‌ర్ 31వ‌తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు అంద‌జేయాల్సి ఉంటుంది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం