తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Wine Shop Tenders 2024 : లిక్కర్ లక్కు.. ఎక్కువ డిమాండ్ ఉన్న వైన్ షాపులను దక్కించుకున్న తెలంగాణ వాసులు!

AP Wine Shop Tenders 2024 : లిక్కర్ లక్కు.. ఎక్కువ డిమాండ్ ఉన్న వైన్ షాపులను దక్కించుకున్న తెలంగాణ వాసులు!

15 October 2024, 13:47 IST

    • AP Wine Shop Tenders 2024 : ఏపీలో వైన్ షాపుల టెండర్లు, లాటరీ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ప్రక్రియలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారికి భారీగా మద్యం దుకాణాలు దక్కాయి. ఏపీలో ఎక్కువ డిమాండ్ ఉన్న వైన్ షాపులు తెలంగాణ వారికి దక్కడం విశేషం.
ఎక్కువ డిమాండ్ ఉన్న వైన్ షాపులను దక్కించుకున్న తెలంగాణ వాసులు
ఎక్కువ డిమాండ్ ఉన్న వైన్ షాపులను దక్కించుకున్న తెలంగాణ వాసులు (Istock)

ఎక్కువ డిమాండ్ ఉన్న వైన్ షాపులను దక్కించుకున్న తెలంగాణ వాసులు

ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు.. ఈసారి ఇతర రాష్ట్రాల వారికి కూడా అవకాశం ఇచ్చారు. దీంతో తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల వారు కూడా భారీగా టెండర్లు వేశారు. వారికి కొన్ని వైన్ షాపులు దక్కాయి. ఏపీలోనే ఎక్కువ డిమాండ్ ఉన్న మద్యం దుకాణాలు తెలంగాణ వ్యాపారులకు దక్కడం ఇప్పడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.

ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు వచ్చాయి. ఈ మద్యం దుకాణాలకు రాష్ట్రంలోనే అత్యధికంగా డిమాండ్ ఉంది. అయితే.. ఈ మూడు షాపుల లైసెన్సులు లాటరీలో తెలంగాణ రాష్ట్రం వారినే వరించాయి.

96వ నంబరు వైన్ షాపు ఖమ్మం జిల్లా ఖానాపురం గ్రామానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణకు దక్కింది. 97వ నంబరు మద్యం దుకాణాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూష దక్కించుకున్నారు. 81వ నంబరు దుకాణం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తల్లపల్లి రాజుకు దక్కింది. ఎక్కువ డిమాండ్ ఉన్న షాపులు తమకు దక్కడంతో వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వ్యాపారులు కూడా టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారు. విజయవాడలోని 14, 18వ నంబరు వైన్ షాపులు మధ్యప్రదేశ్‌‌కు చెందిన రాహుల్‌ శివ్‌హరే, అర్పిత్‌ శివ్‌హరేకు దక్కాయి. మచిలీపట్నంలో ఓ దుకాణాన్ని కర్ణాటకకు చెందిన మహేష్‌ బాతే, మరో దుకాణాన్ని ఢిల్లీ వాసి లోకేశ్‌ చంద్‌ దక్కించుకున్నారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన లిక్కర్ వ్యాపారులకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో రెండేసి దుకాణాలు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 10 మద్యం దుకాణాలు కర్ణాటక, తెలంగాణలకు చెందిన వ్యాపారులు దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులోని 80వ నంబరు దుకాణం పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తికి దక్కింది. ఎన్‌.రామకృష్ణ పదేళ్లుగా పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన కొంతమందితో కలిసి దరఖాస్తు చేయగా.. లిక్కర్ లక్కు వరించింది.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్