AP Wine Shop Tenders 2024 : ఏపీలో ఎక్కువ డిమాండ్ ఉన్న టాప్ 10 వైన్ షాప్స్ ఇవే.. ఒక్కో షాప్‌కు ఇన్ని దరఖాస్తులా!
AP Wine Shop Tenders 2024 : ఏపీలో వైన్ షాప్‌ల లైసెన్సుల కోసం దరఖాస్తులు భారీగా వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఆ సమయానికి 87 వేల 986 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 11 గంటలకు ఈ సంఖ్య 89 వేల 643కు చేరిందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. శుక్రవారం రాత్రి 11 గంటల వరకూ 89 వేల 643 అప్లికేషన్లు వచ్చాయి. అప్పటికీ ఇంకా వ్యాపారులు క్యూలైన్లలో ఉన్నారు. దీంతో దాదాపు 90 వేల వరకూ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,792 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా 10 మద్యం దుకాణాల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి.
టాప్ 10 షాప్స్ ఇవే..
1. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని 96వ నంబర్ మద్యం దుకాణం కోసం ఏకంగా 132 దరఖాస్తులు వచ్చాయి.
2. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని 97వ నంబర్ వైన్ షాపును దక్కించుకోవడానికి 120 దరఖాస్తులు వచ్చాయి.
3.ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని 81వ నంబర్ మద్యం దుకాణం కోసం 110 అప్లికేషన్లు వచ్చాయి.
4. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరులోని 121వ నంబర్ వైన్ షాపు కోసం 108 దరఖాస్తులు వచ్చాయి.
5. కర్నూలు జిల్లా గూడూరులోని 34వ నంబర్ మద్యం దుకాణం కోసం 98 అప్లికేషన్లు వచ్చాయి.
6. గుంటూరు జిల్లా తుళ్లూరులోని 104వ నంబర్ వైన్ షాపు కోసం 95 దరఖాస్తులు వచ్చాయి.
7. గుంటూరు జిల్లా తుళ్లూరులోని 102వ నంబర్ మద్యం దుకాణం కోసం 86 అప్లికేషన్లు వచ్చాయి.
8. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని 84వ నంబర్ వైన్ షాప్‌ను దక్కించుకోవడానికి 86 మంది పోటీపడ్డారు.
9. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని 83వ నంబర్ మద్యం దుకాణం కోసం 86 దరఖాస్తులు వచ్చాయి.
10. గుంటూరు జిల్లా తుళ్లూరులోని 105వ నంబర్ వైన్ షాప్ కోసం 84 దరఖాస్తులు వచ్చాయి.
ఈ జిల్లాల్లో ఎక్కువ..
ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో మద్యం దుకాణాల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 113 షాప్‌లను నోటిఫై చేయగా.. అత్యధికంగా 5,787 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లా వత్సవాయి మండలంలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు అందాయి.
ఈ జిల్లాల్లో తక్కువ..
తిరుపతి, శ్రీసత్యసాయి, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తక్కువగా దరఖాస్తులు అందాయి. ఈ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు తమ వారిని తప్ప ఇతరులెవరినీ దరఖాస్తు వేయనివ్వకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడటంతో దరఖాస్తులు తక్కువగా వచ్చాయని తెలుస్తోంది.