TG Adulterated liquor : మందుబాబులకు అలర్ట్.. కల్తీ మద్యంతో జాగ్రత్త.. మీరు కూడా ఇలా మోసపోవచ్చు!-hyderabad police arrested a gang selling adulterated liquor in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Adulterated Liquor : మందుబాబులకు అలర్ట్.. కల్తీ మద్యంతో జాగ్రత్త.. మీరు కూడా ఇలా మోసపోవచ్చు!

TG Adulterated liquor : మందుబాబులకు అలర్ట్.. కల్తీ మద్యంతో జాగ్రత్త.. మీరు కూడా ఇలా మోసపోవచ్చు!

Basani Shiva Kumar HT Telugu
Oct 10, 2024 03:09 PM IST

TG Adulterated liquor : తెలంగాణలో కల్తీ మద్యం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో పోలీసులు ఓ ముఠాను అరెస్టు చేశారు. తాజాగా మరో ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ఇష్యూలో పోలీసులు విచారణ జరపగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎక్సైజ్ అధికారులు షాకయ్యారు.

తెలంగాణలో కల్తీ మద్యం (Disclaimer: మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
తెలంగాణలో కల్తీ మద్యం (Disclaimer: మద్యపానం ఆరోగ్యానికి హానికరం) (istockphoto)

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం కొత్తూరు సమీపంలో ఎక్సైజ్‌ అధికారులు ఆగస్టు 14న తనిఖీలు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఓ కారును తనిఖీ చేశారు. అందులో ఆర్మీ మద్యంగా చెబుతున్న రూ.11 లక్షల విలువైన 42 సీసాలు దొరికాయి. అధికారులు వాటిని క్షుణ్నంగా పరిశీలించగా కల్తీ మద్యం అని నిర్ధారణ అయ్యింది.

కర్ణాటకలోని బీదర్‌కు చెందిన అంబాదాస్, అభిషేక్‌ వాటిని తరలిస్తున్నట్లు తేలింది. దీంతో వారిని అరెస్టు చేశారు. ఆ కేసులో ఎక్సైజ్‌ అధికారులు లోతుగా విచారణ జరపగా.. తాజాగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖరీదైన బ్రాండ్ల సీసాల్లో తక్కువ ధర మద్యాన్ని నింపి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ తరహా లిక్కర్‌ను వివాహాలు, జన్మదిన వేడుకల్లాంటి ఖరీదైన విందులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

ఇలాంటి వేడుకల్ని నిర్వహించే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల సిబ్బంది కూడా ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు.. అధికారులు అనుమానిస్తున్నారు. ఒక్కో పార్టీలో రూ.20 లక్షల వరకు మద్యం వినియోగిస్తున్న నేపథ్యంలో.. ఖరీదైన బ్రాండ్లను కల్తీ చేస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించాయి. ఖరీదైన మద్యం బాటిళ్ల లేబుళ్లను తొలగించి.. తక్కువ ఖరీదు మద్యాన్ని వాటిలో నింపి.. మళ్లీ లేబుళ్లను బిగిస్తున్నట్టు గుర్తించారు.

ఈవెంట్లలో కొంత మోతాదులో మద్యం వినియోగించిన అనంతరం.. ఈ కల్తీ బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. అప్పటికే నిషా ఎక్కిన తర్వాత వినియోగదారులు కల్తీ బ్రాండ్లను కనిపెట్టలేరనే ఉద్దేశమే ఇందుకు కారణంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే భారీ వేడుకలు జరిగే కన్వెన్షన్‌ సెంటర్లు, ఫామ్‌హౌస్‌లపై ఎక్సైజ్‌ అధికారులు నిఘా పెంచారు.

సెప్టెంబర్ 24న కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం పేరుతో నాసిరక మద్యాన్ని అంటగడుతున్న వైనం వెలుగు చూసింది. బార్ అండ్ రెస్టారెంట్లలో పనిచేసే బార్‌ బాయ్స్‌ అక్కడ తాగేసిన మద్యం బాటిళ్లను సేకరించి తమ దందాకు వాడుకుంటున్నారు.

ఆకుల అజయ్ కుమార్ అనే వ్యక్తి సూచనలతో బంజారాహిల్స్ రోడ్ నం.12లోని షబానా రెసిడెస్సీ నుంచి తీసుకు వస్తున్నట్లు నిందితులు అప్పుడు వివరించారు. దీంతో ఎక్బై జ్ పోలీసులు షబానా రెసిడెన్సీపై దాడి చేశారు. తనిఖీల సమయంలో 10 మద్యం సీసాలు, 189 ఖాళీ మద్యం బాటిళ్లు, మద్యం సీసాలకు బిగించే 100 మూతలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా బార్‌ల నుంచి ఖాళీ బాటిళ్లు సేకరించి.. వాటిలో నాసిరకం మద్యాన్ని మిక్స్‌ చేసి నింపుతున్నట్టు గుర్తించారు.

ఒడిశాకు చెందిన ప్రమోద్ మల్లిక్, జగ న్నాథ్ సాహుల సాయంతో బాటిళ్లను సేకరిస్తున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. పట్టుబడిన వారంతా నగరంలోని పలు బార్లలో పని చేయడం గమనార్హం. బార్లలో తాగేసిన ఖాళీ సీసాలను, సీసాల మూత లను తీసుకొచ్చి ఆ సీసాల్లో నకిలీ మద్యం నింపి విక్రయిస్తున్నారు. ఢిల్లీ, హరియాణా, గోవాల నుంచి తీసుకొచ్చామని నమ్మించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే విక్రయిస్తామని బోల్తా కొట్టిస్తున్నారు. ఇటీవల జూబ్లిహిల్స్‌ వద్ద 30 మద్యం సీసాలను ఒక ఆటోలో తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

Whats_app_banner