Guntur : గుంటూరులో మందుబాబుల కక్కుర్తి.. పోలీసుల ముందే మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన లిక్కర్ ప్రియులు!-a group of drunkards attempted to loot seized liquor in guntur of andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur : గుంటూరులో మందుబాబుల కక్కుర్తి.. పోలీసుల ముందే మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన లిక్కర్ ప్రియులు!

Guntur : గుంటూరులో మందుబాబుల కక్కుర్తి.. పోలీసుల ముందే మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన లిక్కర్ ప్రియులు!

Basani Shiva Kumar HT Telugu
Sep 10, 2024 09:39 AM IST

Guntur : గుంటూరులో విచిత్రమైన సంఘటన జరిగింది. పోలీసులు వివిధ కేసుల్లో మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తుండగా.. ఊహించని ఘటన జరిగింది. ఒక్కసారిగా కొంతమంది మందు బాబులు అక్కడికి వచ్చి.. మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మద్యం బాటిళ్లకోసం ఎగబడుతున్న మందుబాబులు
మద్యం బాటిళ్లకోసం ఎగబడుతున్న మందుబాబులు

గుంటూరు పోలీసులు.. వివిధ కేసుల్లో రూ.50 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఆ బాటిళ్ల ను ధ్వంసం చేయాలని నిర్ణయించారు. గుంటూరు నగరం ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డుకు ఆ బాటిళ్లను తరలించారు. అయితే.. పోలీసులు ధ్వంసం చేసే పని లో ఉండగా ఊహించని ఘటన జరిగింది.

బాటిళ్ల కోసం ఎగబడ్డారు..

పోలీసులు ధ్వంసం చేస్తున్న మద్యం బాటిళ్ల కోసం మందు బాబులు ఎగబడ్డారు. దీంతో గందరగోళం నెలకొంది. మందు బాబులు మద్యం సీసాల వైపు దూసుకురావడంతో.. ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. దీంతో ఎవరికి దొరికిన బాటిళ్లను వారు ఎత్తుకెళ్లారు. కాసేపటికే తేరుకున్న పోలీసులు.. కొందరిని అదుపు చేసి.. వారు నుంచి మద్యం సీసాలను లాక్కున్నారు. అప్పటికే చాలా మంది మద్యం బాటిళ్లతో పరారయ్యారు. ఈ ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

అధికారులు సీరియస్..

ఈ ఇష్యూపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్నప్పుడు వచ్చిన వారిని ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలే వైన్స్ బంద్ అంటున్నారు. అందుకే ఇలా ఎగబడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

వైన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్‌ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. వారంతా ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. కానీ.. ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వం వీరి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

నూతన మద్యం పాలసీ..

అక్టోబర్‌ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అక్టోబర్‌ 1 వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ లో భారీగా అవినీతికి పాల్పడిందని.. ఈసారి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా.. కొత్త మద్యం పాలసీలో మార్పులు, చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

ధరలు తగ్గే అవకాశం..

మద్యం రేట్లను కూడా భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం నిషేధం పేరుతో.. ధరలను విపరీతంగా పేంచేసి, నకిలీ బ్రాండ్లను దించేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో మద్యం ప్రియుల జేబులు గుల్ల కావడమే కాకుండా.. ఆరోగ్యమూ చెడిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం తక్కువ ధర కేటగిరీలో వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను 80 నుంచి 90 రూపాయలకే విక్రయించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి.