Tirumala Laddu Row : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యిని సరఫరా చేశారన్న ఆరోపణలపై తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై వచ్చిన ఆరోపణలు అర్థరహితమని ఆ సంస్థ ఉద్యోగి పేర్కొన్నారు. ఆ సంస్థపై టీటీడీ చట్టపరమైన చర్యలు చేపట్టిన మరుసటి రోజే నెయ్యి తయారీకి ఫిష్ ఆయిల్ ను ఉపయోగించారన్న ఆరోపణను ఆ ఉద్యోగి ఖండించారు. నెయ్యి కంటే ఫిష్ ఆయిల్ ఖరీదైనది కాబట్టి ఈ ఆరోపణ అసంబద్ధమని ఆయన అన్నారు. ఈ రకమైన కల్తీని వాసన ద్వారా వెంటనే గుర్తిస్తామని ఆ సంస్థ క్వాలిటీ కంట్రోల్ అధికారి కనన్ తెలిపారు.
వెజిటబుల్ ఆయిల్, జంతు కొవ్వుతో నెయ్యి కల్తీ చేశారని వస్తున్న ఆరోపణలు మా వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఏఆర్ డెయిరీ ఉద్యోగి ఒకరు తెలిపారు. అంతేకాక చేప నూనెను జోడించారనే వాదన అసంబద్ధం అన్నారు. చేప నూనె నెయ్యి కంటే ఖరీదైనందన్నారు. ఈ రకమైన కల్తీని వాసన ద్వారానే వెంటనే గుర్తించవచ్చని ఆయన ఓ తమిళ ఛానల్ తో అన్నారు. ఏఆర్ డెయిరీ సంస్థ 1998 నుంచి నెయ్యిని ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. నెయ్యి కోసం సేకరించిన పాల నాణ్యతను 102 నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నెయ్యికి టీటీడీ ఆమోదం తెలిపిందన్నారు.
ఏఆర్ డెయిరీ నెయ్యి నమూనాలను టీటీడీకి పంపే ముందు జాతీయ ల్యాబ్ లలో పరీక్షిస్తారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత టీటీడీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరోసారి శాంపిల్స్ పరిశీలిస్తారు. ఇదిలా ఉంటే ఈ వివాదం హిందూ మనస్తత్వాన్ని తీవ్రంగా గాయపరిచిందని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఆదివారం ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ వివాదం హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందన్నారు. ఆలయ నిర్వహణను స్వయంసేవక అధికారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కాకుండా మతపెద్దలు, భక్తులకు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
కంపెనీ సరఫరా చేసిన నెయ్యి నమూనాల్లో జంతు కొవ్వు, పంది మాంసం ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలిందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వుల వాడకంలో ప్రమేయం ఉన్నవారిని ప్రభుత్వం వదిలిపెట్టదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కల్తీ జరిగిందని ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. నివేదిక స్పష్టంగా ఉంది, ఇది ఆరోపణ కాదన్నారు. చంద్రబాబు వాస్తవాలతో మాట్లాడారన్నారు. తాము ఎవరినీ వదిలిపెట్టబోమని, కేవలం సీబీఐ విచారణతో ఈ విషయాన్ని వదిలిపెట్టబోమని, శిక్షలు పడే వరకు తీసుకెళ్తామన్నారు.
(ANI, PTI సమాచారంతో ఈ ఆర్టికల్ రాశాము)
సంబంధిత కథనం